Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని పలికి యమ్మారుతనందనుండు శరీరవర్థనవేగకృతశాఖాభంగధ్వని విని రాక్ష
సులు త న్నెఱుంగుదు రని తలంచి తత్పాదపంబు నతిక్రమించి సీతాప్రత్యయ
కారణంబునఁ ద్రివిక్రమదేవునిభంగి మేనుఁ బెంచి మేరుమందరసంకాశదివ్య
దేహుండును దీప్తానలసమప్రభుండును మహనీయతామ్రవదనుండును వజ్రదంష్ట్ర
నఖుండును భీషణసందర్శనుండు నై యమ్మహీనందనికట్టెదుట నిలిచి మేఘగంభీర
భాషణంబుల ని ట్లనియె.

880


క.

గిరిగహనదుర్గగోపుర, పరిఖాప్రాసాదసౌధపరివృత యగునీ
పురిని బెకలించి కడుస, త్వరముగఁ గొనిపోవ నేను దక్షుఁడ నరయన్.

881


క.

కాపేయమున నశక్తుఁడ, నై పలికినవాఁడఁగాను నరుదారఁగ నా
రూపముఁ జూచితివి గదా, యేపున నాశక్తికొలఁది యెఱుఁగుము తల్లీ.

882


క.

జననీ మతిఁ జలియింపకు, మనుమానము వల దుపేక్ష యవ్వల నిడు మొ
య్యన రామలక్ష్మణులకై, మనమున శోకంబు విడువు మన్నింపు ననున్.

883


సీ.

అన విని సీత మహాద్రిసన్నిభుఁ డైన హనుమంతుఁ గనుఁగొని హరివరేణ్య
నీదుసత్త్వంబును నీదుధైర్యంబును దెల్లంబుగా నేను దెలిసికొంటిఁ
బవనునివేగంబు పావకుతేజంబు నీయందు నిక్కంబు నెగడుచుండుఁ
బ్రకృతి వానరుఁ డెట్లు పాథోధి లంఘించి గురుశక్తి నీలంక సొరఁగ నోపు


తే.

శరధిముద్రిత యైనయాజగతి నెల్ల, భూరిభుజశక్తిఁ దాల్ప నోపుదువు నీవు
పంతమున నన్నుఁ గొనిపోవు టెంత నీకు, లలితగుణధామ వానరకులలలామ.

884


వ.

అని బహూకరించి వెండియు ని ట్లనియె.

885

సీత తాను హనుమంతుని వీఁపుపై నెక్కి సముద్రము దాఁటుట కనుపపత్తులు సెప్పుట

సీ.

వనచరోత్తమ నన్నుఁ గొనిపోవ దక్షుండ వై నను నీతోడ నరుగుదెంచు
టిది నాకు హితము గా దెట్లన్న వడి నీవు పుష్కరపథమునఁ బోవునపుడు
వేగ భయంబున వీఁపున నిలు పోపఁ జాలక వనరాశిసలిలమందుఁ
బడుదాన నవశనై పడిన నన్ను సముద్రచరజంతువులు పట్టి సంభ్రమమునఁ


తే.

దనివి దీరంగ భక్షించు దానఁ జేసి, దాశరథికార్య మెల్ల వ్యర్థ మగుఁ గాన
నగచరోత్తమ నీతోడ నాకు వచ్చు, టెంతయు హితంబు గా దిప్పు డెంచి చూడ.

886


వ.

అదియునుం గాక కళత్రవంతుండ వైననీయందును నిస్సంశయంబుగాఁ బ్రాణ
సందేహం బగు నది యె ట్లనిన భవదీయపృష్ఠదేశంబున నధివసించి చనియెడు
నన్ను విలోకించి భీమవిక్రములైన రాక్షసులు రావణసందిష్టు లై శూలముసలముద్గ
రాదిసాధనంబులు గొని శీఘ్రంబునం బఱతెంచి చుట్టుముట్టుకొని యట్టహాసంబు
గావింపుదు రప్పుడు నాచేత రక్ష్యభారవంతుండ వైననీవు ప్రాణసందేహంబు నొం
దినవాఁడ వగుదువు గావున సాహసకరణంబు కర్తవ్యంబు గాదు వినుము.

887


తే.

అమరవైరులు ఘోరశస్త్రాస్త్రపాణు, లగచరోత్తమ నీవు నిరాయుధుఁడవు
వారితో నెట్లు వినువీథిఁ బోరఁగలవు, చిక్కకుండ న న్నెట్లు రక్షింపఁగలవు.

888