Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నందుఁ గృతనిశ్చయ యై పలుకుచున్న యద్దేవిపలుకులు విని వెండియు హను
మంతుం డి ట్లనియె.

873

హనుమంతుఁడు సీతను దనవీఁపుపై నుంచికొని సముద్రమును దాఁటెద ననుట

చ.

సరసిజనేత్ర రాఘవుఁడు చయ్యన వచ్చి దశాస్యు నాజిలోఁ
బొరిగొని నిన్నుఁ దోఁడుకొని పోవు నిజం బది నమ్మ వేని సు
స్థిరముగ నాదువీఁపున వసింపుము వే గొని యబ్ధి దాటి భూ
వరునకు ని న్నొసంగెదను వహ్ని బలారికి హవ్యము న్బలెన్.

874


ఉ.

వీఁ డొకకీశమాత్రకుఁడు వీఁపున నన్ను వహించి వార్ధి నె
ట్లోడక దాఁటువాఁ డనుచు నుల్లమునందుఁ దలంచితేమొ యా
జాడన చూడు మిప్పుడు నిశాచరసంయుత యైనలంకతోఁ
గూడఁ ద్రికూటము న్బెఱికికొంచు వడిం జన నేర్తు జానకీ.

875


వ.

కావున సంశయంబు విడిచి మదీయపృష్ఠభాగంబు నధివసింపుము మున్ను చను
దెంచినతెఱంగున నశ్రమంబున నిన్ను మోచికొని యరిగిననట్లు గావించితివేని
వ్యవసాయసమాయుక్తుండును ద్వద్దర్శనకృతోత్సాహుండు నై యైరావతగజా
రూఢుం డైనపురందరునిచందంబునఁ బర్వతాగ్రంబున నాసీనుం డైనసాను
జుం డగురాముని దైత్యవధంబునందు విష్ణునింబోలె నీక్షణంబున నీక్షించెదవు
చంద్రునితోడి సంయోగంబు గోరురోహిణీదేవికైవడి రామునితోడి సంయో
గంబు కాంక్షించి మత్పృష్ఠభాగంబు నారోహించి యింద్రచంద్రాదిత్యులతో
సంభాషించుచున్నదానియట్లు గగనార్ణవంబులు తరింపుము వియన్మార్గంబునం
జనునప్పుడు న న్ననుసరించుటకు లంకానివాసు లగురాక్షసులు సమర్థులుగా రని
పలికిన నద్భుతం బైనయతనివాక్యంబు విని హర్షవిస్మితసర్వాంగి యై యద్దేవి
వెండియు హనుమంతున కి ట్లనియె.

876


చ.

హరివర నన్ను మోచికొని యంబుధి నశ్రమలీల దాఁటి స
త్వరముగ రామునొద్దకు ధ్రువంబుగ నేగెద నంచుఁ బల్కె దీ
వరయఁగ నేగతిం జనెద వల్పశరీరుఁడ వింతదవ్వు సు
స్థిరముగ నెంచి చూడ భవదీయకపిత్వ మటంచుఁ దోఁచెడిన్.

877

హనుమంతుఁడు సీతకు నిజరూపమును జూపుట

ఉ.

నా విని యమ్మరుత్సుతుఁడు నాభుజసత్త్వము నాప్రభావ మీ
దేవి యెఱుంగ కున్కి నతిధీరుని నల్పునిఁ గాఁగ నెంచె మ
ద్దేవగిరీంద్రతుల్యఘనదేహముఁ జూపుదుఁ గాక యంచుఁ దా
భావమునం దలంచి నరపాలునిగేహినిఁ గాంచి యి ట్లనున్.

878


క.

అరుదార నాప్రభావం, బెఱుఁగక న న్నల్పుఁ గాఁగ నెంచితి విఁక నా
గురుతరరూపముఁ జూపెద, సురుచిరముగ భయము దక్కి చూడుము తల్లీ.

879