| |
వ్రతుఁడు మహానుభావుఁ డగురాముఁడు సేమము నొందియున్నవాఁ
డతనికిఁ దమ్ముఁ డంచితగుణాకరుఁడున్ గురువత్సలుండు ధీ
చతురుఁడు లక్ష్మణుం డవనిజా కుశలంబున నున్నవాఁ డొగిన్.
| 818
|
| ఉ. |
జానుగ దైవయోగమున సమ్మతి నిచ్చట నిన్నుఁ గంటి నం
భోనిధిలంఘనం బిపుడు పొల్పుగ వ్యర్థము గాక చెల్లె నీ
నానక దుఃఖశోకమున గాసిలుచున్న నినాట వీరులకొ
మానుగఁ దేర్పఁ గంటి నసమానవిశాలయశంబుఁ గాంచితిన్.
| 819
|
| క. |
దేవీ వెఱవకు మిఁక నీ, జీవితవిభుఁ డేగుదెంచి చెచ్చెర ననిలో
రావణుని బంధయుతముగ, వావిరి వధియించి నిన్ను వడిఁ గొనిపోవున్.
| 820
|
| ఉ. |
అంబుజనేత్ర రాముఁడు నిజానుజు భానుజుఁ గూడి మాల్యవం
తం బనుశైలమందు సతతంబు భవద్విరహప్రభూతశో
కంబున నున్నవాఁ డిపు డిఁకం జని నీవిధ మేను జెప్ప శీ
ఘ్రంబున వచ్చుఁ గీశనికరంబులఁ గూడి దశాస్యుఁ జంపఁగన్.
| 821
|
| తే. |
అంబుజేక్షణ మాల్యవదాఖ్యశైల, మఖిలగిరులలో నుత్తమ మగుచుఁ దనరుఁ
గడిమి నచ్చట నుండి గోకర్ణనామ, పుణ్యదేశంబుఁ జేరంగఁ బోయి యందు.
| 822
|
| చ. |
జనకతనూజ యెవ్వఁ డట సంయమిచోదితుఁ డై బలోద్ధతి
న్వననిధిపుణ్యతీర్ధమున వారక గ్రుమ్మరువాని శంబసా
దనుని వధించె నట్టి కపితల్లజు కేసరిపత్నియందు నే
ననిలునకున్ జనించినవనాటుఁడ వాయుసమప్రభావుఁడన్.
| 823
|
| క. |
జననీ నిజకర్మంబున, హనుగుంతుం డనెడిపేర నలరినవాఁడ
న్వినుతజవసత్త్వయుక్తుఁడ, నినజునిసచివుండ రాఘవేంద్రునిదూతన్.
| 824
|
| క. |
మునుకొని విశ్వాసార్థము, జనకజ నీవిభునిసుగుణజాలము లెల్ల
న్వినిపించితి నిఁక రాముఁడు, జననాయకమౌళి నిను వెసం గొనిపోవున్.
| 825
|
| క. |
అని తనవృత్తాంతము రా, మునివృత్తాంతంబు సర్వము న్గడుభక్తి
న్వినిపించిన విని జానకి, మనమునఁ గల దిగులు కొంత మట్టుపడంగన్.
| 826
|
| క. |
నానావిధరూపాభి, జ్ఞానంబులఁ గారణముల సల్లాపముల
న్వానరవర్యుని నిక్కము, మానవపతిదూతఁ గాఁగ మది నెఱిఁగి వెసన్.
| 827
|
| క. |
మునుకొని యానందాశ్రులు, కనుఁగొనలం గ్రమ్ముదేరఁ గమలాయతలో
చన మగువదనము రాహువ, దనముక్తుం డైనశశివిధంబున నలరన్.
| 828
|
| ఆ. |
ఏమి నోము చేసి యీవేళఁ బతివార్త, వింటి వంటి ముదము గంటి ననుచుఁ
జాల విస్మయంబు జనియింప సమ్మోద, కలికచిత్త యగుచు నలరుచుండె.
| 829
|
హనుమంతుఁడు సీతకు రామదత్తం బగునాంగుళీయకము నిచ్చుట
| వ. |
అప్పు డాహనుమంతుండు వెండియు సీత నవలోకించి యి ట్లనియె.
| 830
|