Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః

గోపీనాథరామాయణము

కిష్కింధాకాండము



కైవల్యరమాధిప
రాకేందుసమానముఖ పురందరముకుటా
స్తోకానేకమణీశో
భాకీలితచరణ సత్యభామారమణా.

1


వ.

దేవా యవధరింపుము కుశీలవు లగుకుశలవు లవ్వలికథ యి ట్లని చదువం దొడంగి
రట్లు రాముండు సౌమిత్రిసహితంబుగాఁ బద్మోత్పలఝషాకుల యగుపంపాపు
ష్కరిణి నధిగమించి మదనోద్దీపనకరంబు లగుతదీయసుషమావిశేషంబు లవలో
కించి కామశరనిపీడ్యమాసమానసుం డై లక్ష్మణున కి ట్లనియె.

2

రాముఁడు వసంతఋతువుం జూచి మన్మథాభితప్తుఁడై విలపించుట

క.

విలసితతరుశోభితయై, సలలితవైడూర్యవర్ణసతిలాగ్రనట
జ్జలజోత్పలయుతయై రా, జిలుచున్నది కంటె పంప చిరశుభలీలన్.

3


తే.

ఎచట శిఖరాన్వితము లైనపృథునగంబు, లట్ల యుచితతరువు లొప్పారుచుండు
నట్టి పంపాసరోవరప్రాంతచిత్ర, వనము శోభిలుచున్నది యనఘ కంటె.

4


తే.

భరతు నెడఁ బాసి సతిని గోల్పడి దురంత, దుఃఖభారంబుచే స్రుక్కి తూలుచున్న
న న్నిచటఁ జాలఁ బీడించుచున్న వాని, మాడ్కి వర్తించుచున్నాఁడు మాధవుండు.

5