Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జాలంబు లంబరంబునం బర్వఁ దదీయభీషణనిర్ఘోషంబుభంగి మహానాదంబు
సేయుచు నవక్రపరాక్రమంబున జగత్త్రయంబును బాదత్రయంబున నాక్రమింప
నుషక్రమించు త్రివిక్రమదేవుపోలిక సుధాహరణదీక్షాదుర్నిరీక్షుం డగునండజ
మండలాఖండలునికైవడిఁ దనశరీరంబుఁ బెంచి విజృంభించి బంగరుగట్టుమాడ్కి
దిట్ట యై చూపట్టె నప్పు డవ్వీరశిఖామణిరూపంబు తేజఃపూర్యమాణం బై
యదృష్టపూర్వశోభావిశేషంబునం బొలిచె నంబరీషోపమం బైనతదీయవదనంబు
ప్రదీప్తం బై విధూమపావకునిమాడ్కి శోభిల్లె నాసమయంబున.

1377


సీ.

తొడరి దైత్యులపాలి ధూమకేతువుఁ బోలె లక్షింపఁదగినవాలంబువాని
బాలార్కబింబంబుపగిది సముజ్జ్వలస్ఫూర్తి మైఁ గనుపట్టుముఖమువాని
మేరుమందరమహామేదినీధరతుల్యకమనీయదివ్యవిగ్రహమువాని
బ్రళయకాలమునాఁటి భయదమేఘముభంగి నురువడి గర్జించుచున్నవాని


తే.

సకలదిక్కులు భూరితేజంబుచేత, నుజ్జ్వలంబుగ వెలిఁగించుచున్నవాని
దండిమెయి ముజ్జగంబులు నిండి నట్టి, ఘనుఁడగు త్రివిక్రమునిభంగిఁ గ్రాలువాని.

1378


చ.

అనిలతనూజుఁ గాంచి కపులందఱు శోకము వీడి మానసం
బునఁ గడువిస్మయంబును సమున్నతహర్షము పిక్కటిల్లఁగా
ఘనములకైవడి న్మిగుల గర్జలు సల్పుచు వేడ్కతోడ న
య్యనఘునిఁ గొల్చి యుండిరి జయధ్వనులం గడు సన్నుతించుచున్.

1379

హనుమంతుఁడు వర్ధమానబలుం డై వీరాలాపంబు లాడుట

వ.

ఇట్లు విజృంభమానశరీరుం డై యప్పవమాననందనుండు స్తోత్రవాక్యంబులచేత
నంత కంత కుత్సాహంబు రెట్టింప సింహంబు గిరిగహ్వరంబునందు విజృంభిం
చినమాడ్కి విజృంభించి రోమాంచకంచుకితదేహుండై కవుల నందఱ నానం
దసముద్రవీచికాసందోహంబులం దేలుచు రయంబున నాహరిమధ్యంబున నుం
డి వెల్వడి హరివృద్దు లగుజాంబవదాదుల కభివందనంబులు చేసి మేఘగంభీర
భాషణంబుల ని ట్లనియె.

1380


ఉ.

ఎవ్వఁడు ప్రాణ మిజ్జగతి కెవ్వఁడు నిర్జరమార్గగోచరుం
డెవ్వఁడు హవ్యవాహసఖుఁ డెవ్వఁ డమోఘరయుండు శీఘ్రగుం
డెవ్వఁడు తత్సదాగతికి నేను గుమారుఁడఁ గాన మత్సముం
డెవ్వఁడు లేఁడు ధారుణీ నహీనపరాక్రమసత్త్వసంపదన్.

1381


సీ.

వాలవిక్షేపదుర్వారవాతాహతి జలధరంబులు దూలి మలల డాఁగ
నతులభుజోరువాతాతివేగమున నంభోనిధిగ్రాహము ల్మూర్ఛ నొందఁ
గమనీయవక్షోవిఘట్టనంబున శైలవృక్షషండంబులు విఱిగి కూల
దారుణాశనిసన్నిభోరుఘట్టనమునఁ బృథివీధరంబులు పిండి గాఁగ