| వ. |
అని పలికి యవ్విరించననందనుండు ప్రఖ్యాతబలపౌరుషం డగువానిఁ బ్లవనశీలు
రలో వరిష్ఠుం డగువాని నేకాంతంబు నాశ్రయించి సుఖోపవిష్టుం డై యున్న
వానిఁ గపివంశప్రదీపకుం డైనహనుమంతు నవలోకించి యెల్లవారును విను
చుండ మృదుపూర్వకంబుగా ని ట్లనియె.
| 1354
|
| ఉ. |
సారగుణోత్తరుండవు ప్రసన్నబలుండవు కీశవంశవి
స్తారుఁడ వర్థధర్మనయశాస్త్రవిదుండవు శౌర్యశాలి వో
మారుతపుత్ర నీపనులు మాపయిఁ బెట్టఁ దొలంగి పల్క కి
ట్టూరక యున్నవాఁడవు పయోనిధి దాఁటఁగ మాకు శక్యమే.
| 1355
|
| క. |
జవతేజోవిక్రమముల, రవిసుతునకు లక్ష్మణునకు రామునకును గం
ధవహునకు సాటి వత్తువు, పవమానతనూజ నీవు పరికింపంగన్.
| 1356
|
| చ. |
ఖగపతి వైనతేయుఁ డలకశ్యపపుత్రుఁడు శౌర్యశాలి ప
న్నగకులవైరి ము న్నురగనాథులఁ జేకొని పెక్కుమాఱు ల
త్యగణితసత్త్వసంపదల నంబుధి దాఁటఁగఁ గంటి దాని ప
క్షగతబలంబు నీఘనభుజంబులకుం గల దెన్ని చూడఁగన్.
| 1357
|
| తే. |
బలము తేజంబు బుద్ధియుఁ బ్రాభవంబు
విక్రమము శౌర్యసంపద వేగ మఖిల
భూతములకంటె నీకు విఖ్యాతభంగి
నెక్కుడై యుండు నింతయు నిక్కువంబు.
| 1358
|
జాంబవంతుఁడు హనుమంతునిం బొగడుట
| సీ. |
అమరవేశ్యలలోన నతికీర్తనీయ యై యలరారుఁ బుంజికస్థల యనంగ
నది శాపవశమున నగచరపతి యైన కుంజరునకు ముద్దుకూఁతు రగుచు
జనియించి యంజన యనుపేర లోకవిశ్రుతిఁ గాంచి యసమానరూపమహిమఁ
దనరారి కేసరి యనుబలీముఖవీరునకు బత్ని యై యొక్కనాఁడు వేడ్కఁ
|
|
| తే. |
గామరూపిణి గావునఁ గాంక్షతోడ
వలుఁదచన్నులు వాలుచూపులు విశాల
జఘనము వినీలకచములు చారుముఖము
గ్రాల శృంగారముగ మర్త్యకాంత యగుచు.
| 1359
|
| సీ. |
తనముద్దుమోముఁ గన్గొని నవాంభోజాత మని తేఁటిగమి కొంత చెనకఁ దివురఁ
దనమోవి మురువుఁ గన్గొని బింబఫల మని రాజకీరంబులు రద్దు సేయఁ
దనపాదములయంద మనువుగాఁ బరికించి విద్రుమభ్రాంతిఁ గోవెలలు గలియఁ
దసబాహువులు గాంచి ఘనమృణాళములంచు నెంచి యంచలు వేడ్క మించి యలర
|
|
| తే. |
గటకనూపురమేఖలాఘటితరత్న, ఘంటికానాదములు ఘల్లుఘల్లు మనఁగ
శైలకటకాంతరస్థవిశాలరమ్య, చందనోద్యానమున నాడుసమయమందు.
| 1360
|