Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథపాతం పుట 154

జనుదెంచి న న్నాశ్వాసించి ఖగేంద్రా నీవు దైవికంబున జీవించితి వింక నీకు
నిస్సంశయంబుగా స్వస్తి యగునని పలికిన నది యేమి యని యడిగిన నమ్మహాత్ము
లు నా కి ట్లనిరి.

1270


చ.

అనుపమశక్తియుక్తుఁడు దశాస్యుఁడు రాక్షసభర్త వాఁడు రా
మునిసతి బల్మిఁ గైకొని సముధ్ధతి నేగెడువానికడ్డ మై
యనిమిషు లైన నిల్వఁగ సమర్థులు గా రిపు డీవు వానికి
న్గనఁబడి గ్రమ్మఱ న్బ్రతుకుఁ గంటివి నేఁ డిటు దైవికంబునన్.

1271


మ.

అనఘా యాదివిజారి యంకగత యై 'హారామ హాలక్ష్మణా'
యని వాపోవుచు దివ్యకాంచనమణీహారావళు ల్పుచ్చుచుం
గనుల న్బాష్పజలంబు గాఱ నొడ లాకంపింప నాక్రందన
స్వనముం జేయుచుఁ జన్ కాంతను మదిన్ క్ష్మాపుత్రిఁగాఁ జూడుమీ.

1272


వ.

అని పలికి యమ్మహర్షిశ్రేష్ఠులు నన్నుం బంచిన.

1273


క.

ఆ కారణమున నే నిపు, డాఁకలి గొని యున్న నీకు నాహారంబున్
దే కూరక వచ్చితి నని, ప్రాకటముగ నంతయును సుపార్శ్వుఁడు చెప్పెన్.

1274


ఉ.

చెప్పిననాఁటనుండియును జిత్తమునం గడుఁ గోప మూఁది నే
నెప్పుడు పంక్తికంఠు వధియింపుడు సీతను రామభర్త కే
నెప్పుడు భక్తి నిత్తు నని యంతయుఁ జింతిలుచుందుఁ జెప్పిన
ట్లొప్పుగఁ జేయ లేనయితి నొక్కట ఱెక్కలు లేమి నారయన్.

1275


వ.

నాకును మీకుం బోలె రామకార్యం బవశ్యకర్తవ్యంబై యుండు వాగ్బుద్ధిగుణ
వర్తియైన నాచేత నెయ్యది యాచరింప శక్యంబగు నట్టిసాహాయ్యంబుఁ జేసెద
నేను వాక్కుచేతను బుద్ధిచేతను మీ కందఱకు హితం బాచరించెద మీరు
బలవంతులరు బుద్ధిమంతులరు రామలక్ష్మణులదివ్యాస్త్రంబు లమోఘంబులు
ముల్లోకంబుల నైన రక్షింపను శిక్షింపను సమర్థంబులు సుగ్రీవుండు తేజోబలస
మన్వితుండు విూరింద ఱేకోద్యోగులై గడంగిన దురాత్ముం డగురావణుండు పొ
లియుట కెంత యశ్రమంబున వానిం బరిమార్చి కల్యాణగుణసమేత యైనసీతం
జేకొని రామునకు సమర్పించెదరు గావునఁ గాలవిలంబనంబు సేయక భవిష్య
దర్థంబునందు బుద్ధినిశ్చయంబు గావింపుఁడు భవాదృశు లైనబుద్ధిమంతులు
కార్యంబులందుఁ జిక్కు పడ రని పలికి వెండియు జనితవిశ్వాసుం డై సంపాతి
సంతోషవిశేషంబున నంగదు నవలోకించి నావృత్తాంతంబును సీతావృత్తాంతం
బును విస్పష్టంబుగా వినిపించెడ నేకాగ్రచిత్తు లై వినుం డని యి ట్లనియె.

1276

సంపాతి వానరులకుఁ దనపూర్వవృత్తాంతము సెప్పుట

క.

మును చండకరునికరముల, ఘనముగ నాపక్షయుగము గాలి మహీధ్రం
బునఁ బడితి నన్నవార్తను వినిపింపఁగ మీర లెల్ల వింటిరి గాదే.

1277