| |
కల్పంబు లగువిమలజలంబులు గ్రోలి యాఁకలి నీరువట్టునుం బాపికొని యపగత
వ్యాయామఖేదుల మైతి మని పలికిన నత్తపస్విని మహాత్ము లగుమిమ్ముఁ బూజిం
చుటవలన నేను గృతార్థ నైతి మీయట్టిపుణ్యాత్ములసందర్శనంబు దొరకొ
నుట బహుజన్మకృతసుకృతపరిపాకంబు గదా యని బహూకరించె నంత
హనుమంతుండు వెండియు నత్తాపసి కి ట్లనియె.
| 1162
|
| క. |
జనకసుతను మాసములోఁ, గనుఁగొని చనుదెం డటంచుఁ గపిపతి యనుపం
జనుదెంచి కాల మంతయుఁ, జనఁ జెడి యున్నార మెందుఁ జన లే కిచటన్.
| 1163
|
| చ. |
జనకజఁ గాన మైతి మిటఁ జయ్యనఁ గాలము పోయె భానుమ
త్తనయుఁడు తీవ్రశాసనుఁడు తప్పక నీక్షణ మేమి సేయునో
యని మదిలోనఁ గూరినభయంబునఁ జేడ్పడి యున్నమ్ము నీ
ఘనగుహ వెల్వరించి యనుకంప దలిర్పఁగఁ బ్రోవఁగాఁ దగున్.
| 1164
|
| క. |
నరపతి పుణ్యచరిత్రుం, డరయఁగఁ దత్సతిని వెదక నరుగఁగ వలయుం
గరుణ దళుకొత్త మము నీ, నిరుపమగుహ వెల్వరింప నీకుం జెల్లున్.
| 1165
|
| వ. |
అనిన నత్తాపసి యి ట్లనియె.
| 1166
|
| ఉ. |
ఈవివరంబుఁ జొచ్చి ధర నెవ్వఁడుఁ గ్రమ్మఱఁ బ్రాణయుక్తుఁ డై
పోవఁగఁ జాలఁ డే నిపుడు భూరిసమగ్రతపోబలంబునన్
వే వెడలింతుఁ గన్ను లటు వేగమె మూయుఁడు మూయ కున్న నీ
క్రేవఁ దొడంగి యే వెలువరింపఁగఁ జాలను మిమ్ము నిమ్మెయిన్.
| 1167
|
స్వయంప్రభ తపోబలంబున ఋక్షబిలంబునుండి వానరుల వెల్వరించుట
| వ. |
అనిన విని యబ్బలీముఖపుంగవు లట్లు గాక యని శీఘ్రంబున బిలంబు నిర్గ
మించునాసం జేసి.
| 1168
|
| మ. |
సుకుమారాంగుళిహస్తరుద్ధముఖు లై చూపట్టినం జూచి త
ప్పక యత్తాపసి సంతతార్జితతపఃప్రాప్తప్రభావంబుచే
నొకకాష్ఠం దగ నబ్బిలంబును రయం బొప్పార దాఁటించె సూ
ర్యకుమారాగతభావిశిక్షణభయభ్రాంతాత్ములం గీశులన్.
| 1169
|
| వ. |
ఇత్తెఱంగున నబ్బిలంబు వెల్వరించి యత్తాపసి వానరుల నందఱ నాశ్వాసించి
యిట్లనియె.
| 1170
|
| మ. |
ఇది నానాద్రుమగుల్మవల్లికలచే నేపారు వింధ్యాచలం
బదె యుత్తుంగతరంగఘట్టనసముద్యద్భూరినిర్ఘోషణా
స్పదమై యొప్పెడుఁ గంధి మీకు నలువొప్ప న్స్వస్తి యౌఁ గాక వే
డక్క దలిర్పంగ బిలంబులోని కిఁక శీఘ్రం బొప్ప నేఁ బోయెదన్.
| 1171
|
| క. |
అని పలికి యాస్వయంప్రభ, వినయంబున విపినచరుల వీడ్కొని శీఘ్రం
బున శైలబిలములోనికిఁ, జనియెఁ దపోమహిమఁ జేసి సంతస మలరన్.
| 1172
|