Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.⁠

అలసి సలిలార్థు లై బ్రతుకాన విడిచి
వదనములు వాడ దైన్యంబు గదుర సంభ్ర
మమున నొక్కింతవడి బిలమధ్యమందుఁ
బరితపించుచు నాఁకట బడలి యుండి.

⁠ 1140


వ.⁠

వెండియు నొక్కింతధైర్యంబున నబ్బలీముఖపుంగవు లొండొరులం బట్టుకొని
యబ్బిలంబులోన మఱికొంతదూరం బతిప్రయత్నంబున నరిగి యవ్వల.

⁠ 1141


క.⁠

అరుదార మృగాంకదివా, కరనక్షత్రగ్రహప్రకాండద్యుతు ల
త్తఱిఁ గుప్ప గూర్చినట్లుగఁ, గర మొప్పెడు నొక్కవెలుఁగుఁ గాంచిరి మ్రోలన్.

⁠ 1142


వ.⁠

కని డాయం జని యందు వైశ్వానరసమప్రభసువర్ణమయకుసుమకిసలయఫలస్త
బకలతావిలసితశాఖాశిఖోల్లసితంబులును గాంచనమయవిచిత్రపత్రలక్షితకలరవ
కలకంఠకీరశారికాభ్రమరసంకులంబులు నగుసురుచిరవిభూషణభూషితహేమాభి
రామసాలతాలతమాలతక్కోలరసాలహింతాలనారికేళపున్నాగవకుళచంపకకర్ణి
కారజంబీరజంబూనింబకదంబఖర్జూరకకుభాదిదివ్యతరునికరంబులును హిరణ్మయ
కమలోత్పలకైరవమత్స్యకచ్చపహంసక్రాౌంచచక్రవాకసారసబకకారండవసంకు
లంబు లగునీలవైడూర్యవర్ణసరోవరంబులును దరుణాదిత్యసంకాశంబు లగు
వైడూర్యమణివేదికాతలంబులును బ్రవాళమణిసన్నిభంబు లగునానావిధపుష్ప
లతావితానంబులును బురుషోపలగారుత్మతవైడూర్యముక్తాజాలవిరచితగవాక్ష
కుడ్యకవాటద్వారతోరణస్తంభాలంకృతసువర్ణగృహముఖ్యంబులును మణికాం
చనవిచిత్రమహార్షశయనాసనయానంబులును హైమరాజతకాంస్యంబు లగు
భాజనంబులును దివ్యంబు లగుచందనాగరునిచయంబులును మనోజ్ఞంబు లగు
మూలఫలంబులును రసవంతంబు లగుమధుమైరేయాదిపానద్రవ్యంబులును
గాంచనమయంబు లగుదివ్యాంబరస్రగ్విభూషణచిత్రకంబళాజినంబులును సుగం
ధబంధురంబు లగుదివ్యగంధంబులును సమంతతోన్యస్తదీప్తవైశ్వానరోపమ
సువర్ణరత్నసంచయంబులునుం గలిగి యమరావతీపట్టణంబు నాక్షేపించుచున్న
యొక్కదివ్యపట్టణంబు పొడగని సువర్ణవైడూర్యచంద్రకాంతమణిస్థగితంబు లగు
తత్పురీబాహ్యాభ్యంతరప్రదేశంబులు వీక్షించుచుం జని.

⁠ 1143

హనుమదాదులు స్వయంప్రభ యనుతపస్వినిం గాంచుట

ఉ.⁠

వ్రేలుమృగాజినంబు సవరించి యినాంశులసజ్జటాచ్ఛటల్
గ్రాలఁగ ఘోరనిష్ఠ నచలస్థితిఁ బూర్ణసమాధియుక్త యై
చాలఁ దపంబు సేయుచు నిజప్రభలం బుర మెల్ల వీచికో
ద్వేలము సేయుచున్న యొకదివ్యతపస్విని గాంచి రప్పురిన్.

⁠ 1144


క.⁠

కని దానిమహిమ కెంతయు, మనమున నచ్చెరువు గదుర మఱిమఱి డాయం
జని మర్కటవీరులు చ, య్యనఁ బరివేష్టించి యుండి రధికప్రీతిన్.

⁠ 1145


వ.⁠

అప్పుడు హనుమంతుం డత్తపస్విని కభివందనంబు చేసి యి ట్లనియె.

⁠ 1146