Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

హరిపదచుంబిదీర్ఘశిఖరాన్విత మై సురదైత్యసేవ్య మై
సురుచిరరత్నకందరసుశోభిత మై శిశిరాఖ్యమేదినీ
ధర మలరారుఁ దద్గిరినితం బగుహాగహనప్రపాతగ
హ్వరములయందు వే వెదకుఁ డంచితభంగి మహీకుమారికన్.

1008


వ.

అమ్మహాపర్వతం బతిక్రమించి యవ్వల లక్షణసముద్రంబు దాఁటి తత్తీరదేశంబున
సిద్ధచారణసేవితం బై యగాధం బై రక్తజలం బై శీఘ్రగామియై శోభిల్లుశోణా
ఖ్యనదంబుఁ జేరి రమ్యంబు లైనతదవతరణప్రదేశంబులందును విచిత్రంబు లైన
వనంబులందును వైదేహీసహితంబుగా రావణు నన్వేషించి యవ్వలఁ బర్వత
సంభూత లైననదులను రమ్యంబు లైనబహునిష్కుటంబులను దరీమంతంబు లైన
పర్వతంబులను వనంబులను వైదేహి వెదకి యవ్వలఁ బ్లక్షద్వీపంబును నుప
ద్వీపంబులునుం బరిశోధించి యటమీఁద నూర్మిమంతంబును మహారౌద్రంబును
వాతోద్ధతతరంగమాలాసంకులంబును గాలమేఘప్రతిమంబును మహోరగనిషేవి
తంబును మహానాదంబు నరునితో సముద్రంబు గనుంగొని దాని నుపాయంబున
నధిగమించి యిక్షుసముద్రమధ్యద్వీపంబు లన్నియుఁ బరిశోధింపుఁ డమ్మహోదధి
యందుఁ గమలాసనుశాసనంబున మహాకాయు లగురాక్షసులు దీర్ఘకాల
బుభుక్షితు లై నిత్యంబును ఛాయాగ్రాహు లై యుందురు తత్ప్రదేశంబు నుపా
యంబున దాఁటి యవ్వలఁ గుశద్వీపంబు నెమకి యవ్వల మహాభీమంబును రక్త
జలంబు నగులోహితనామసాగరంబును మధుసముద్రంబు నవలోకించి యవ్వల
శాల్మలీద్వీపంబు విలోకింపు డందుఁ గైలాసశిఖరసంకాశంబును నానారత్నవిభూ
షితంబును విశ్వకర్మనిర్మితం బగువైనతేయుని దివ్యమందిరంబు గల దచ్చట శైల
సంకాశులును భీమదర్శనులును నానారూపభయావహులు నగుమందేహనామ
రాక్షసులు గాయత్రీప్రభావహతు లై పవలెల్ల మార్తాండకిరణంబులవేఁడిమికిం
గాక సముద్రజలంబులం బడి మునింగి యుండి రాత్రికాలంబున జలంబులు వెడలి
వచ్చి గిరిశిఖరంబులందు వ్రేలుచుండుదురు వారి నవలోకించుచు నవ్వల సర్పిస్సము
ద్రంబును దధిసముద్రంబునుం బరీక్షింపుఁ డటమీఁదఁ బాండురమేఘసంకా
శంబై క్షీరసముద్రంబు శోభిల్లు నది మహోర్ములచేత ముక్తాహారంబుకైవడి
నొప్పుచుండుఁ దన్మధ్యభాగంబున దివ్యతరకుసుమవిసరవిరాజితనానాతరువ్రాత
సంకులం బై వృషభనామకం బైనయొక్కశ్వేతపర్వతంబు విలసిల్లుఁ దదుపరి
భాగంబున విలసితరజతహేమకింజల్కపుంజరంజితశతపత్రవిలీయమానచక్రమ
రాళసారసం బై సుదర్శననామసరోవరంబు శోభిల్లు నమ్మహానళినికి సిద్ధచారణ
యక్షకిన్నరగరుడగంధర్వోరగసాధ్యాదులు జలక్రీడాతత్పరు లై నిత్యంబు నేతెం
తురు తద్విహారకౌశలంబు నిరీక్షించుచు క్షీరసాగరంబు గడచి యవ్వల సకలభూత
భయావహం బైనశుద్ధోదకసముద్రంబు శోధింపుఁడు తన్మధ్యదేశంబున నౌర్వ
కోపసంభూతం బైనహయముఖం బగుతేజంబు నిక్షిప్తం బై వర్తించుచుండు