Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యీనినతెఱంగున నెక్కడఁ జూచినం దెఱపి యీక లెక్కకు వెక్కసం బై
కోలాహలబహులంబుగా నిండి యుండి రప్పుడు.

996


చ.

పరుగులు పాఱుచున్ దరులఁ బ్రాఁగుచుఁ దోఁకలు ద్రిప్పి యాడుచు
న్జఱియలఁ గ్రేళు దాఁటుచు వనంబున డాఁగుచు వల్లికాగృహో
త్కరములఁ దూఱుచు న్ఘనముకైవడి గర్జలు బి ట్టొనర్చుచు
న్సురుచిరభంగి నర్కజుని సూరెల నిల్చిరి కీశయూథపుల్.

997


వ.

మఱియుఁ గొందఱు యథోచితంబుగా వస్త్రాదికంబు సంకుచితంబు చేసి బద్ధాం
జలు లై సుగ్రీవునిం బరివేష్టించి యుండిరి సుగ్రీవుండు త్వరితుండై యాసమస్త
వానరశ్రేష్ఠుల నయ్యైతెఱంగులఁ బ్రణామాలింగనవచోగౌరవాదివిశేషంబులఁ
బ్రీతచేతస్కులం జేసి రామునకు సమర్పించి పదంపడి ధర్మజ్ఞుండు గావున బలం
బుల నెల్లఁ బర్వతనిర్ఝరంబులయందును సమస్తవనంబులయందును యథాసుఖం
బుగా విడియ నియమించి మీమీబలంబుల విభజించుకొని తద్రక్షణంబునం
దేమఱక యుండుం డని సేనాపతులకెల్ల నాజ్ఞాపించి ఫాలంబునం గేలు గీలించి
రాము నవలోకించి వినయవాక్యంబున ని ట్లనియె.

998

సుగ్రీవుఁడు తనసైనికుల రామునకు నొప్పగించుట

సీ.

నృపవర మద్దేశనిలయు లైనసమస్తకపులు దిక్కుల నుండి గడురయమున
వచ్చిరి వీరు దుర్వారబలాఢ్యులు కామరూపులు భయంకరశరీరు
లమితసంఖ్యాతులు ఖ్యాతకర్మాపదానులు మహాభుజవీర్యకలితు లభయు
లుత్తమవ్యవసాయు లురువిక్రములు దేవదైత్యసన్నిభులు కాంతారచరులు


తే.

వీరి నీకింకరులు గాఁగ విశదబుద్ధిఁ
జేకొని బలాబలంబు లస్తోకయుక్తి
నెఱిఁగి తగుభంగి మన్నించి హితము నెఱపి
ప్రాభవంబున నీ వింకఁ బనులు గొనుమ.

999


ఉ.

అందఱు స్వామికార్యరతు లందఱు భూరివివేకయుక్తు లిం
దందఱుఁ గాలకింకరనిభాకృతు లంద ఱరిందము ల్కరం
బందఱు శత్రులోచనభయంకరమూర్తులు వీరిలోన వీఁ
కం దగువారి సీత వెదకం దగఁ బుచ్చుము రాజశేఖరా.

1000


క.

నా విని సంతోషము మది, నావిర్భావంబు నొంద నర్కకులుఁడు సం
భావించి మధురముగ సు, గ్రీవునితో నిట్టు లనియెఁ బ్రియ మలరారన్.

1001


ఉ.

ఎచ్చటఁ బంక్తికంఠుఁడు విశృంఖలవృత్తి వసించియున్నవాఁ
డచ్చటి కేగి సీతవిధ మంత యెఱింగి ముదంబు మీఱ వే
వచ్చెడునంతశక్తి గలవానరు లెవ్వరొ నే నెఱుంగ నీ
వచ్చుపడంగ నట్టివిపినాటుల నారసి పంపఁగాఁ దగున్.

1002