| క. |
క్షితిపతికి హితము గావించితివేనియుఁ దన్మహావిచిత్రశరాసన
చ్యుతవజ్రసన్నిభాశుగ, వితతులఁ గనుఁగొనక సుఖత వెలసెద విచటన్.
| 897
|
తార లక్ష్మణుని ననునయించుట
| క. |
అని పెక్కు తుల లక్ష్మణుఁ డనుపమకోపంబు రోహితాకృతిఁ గనులం
గనుపట్టఁగఁ బల్కిన న, య్యినవంశజుఁ జూచి తార యిట్లని పలికెన్.
| 898
|
| చ. |
అనఘ భవన్ముఖేరితమహాశనిసన్నిభదారుణోక్తులన్
వినఁ జతురుండు గాక కడు వెల్వెలఁ బోవుచు నున్నయాతఁ డీ
యినజుఁ డొకింతనేరమున కింత తిరస్కరణంబు సేయఁగాఁ
జనునె వయస్యునిం దొడరి చంపిన దోషము గాదె యారయన్.
| 899
|
| చ. |
తరణితనూజుఁ డక్కట కృతఘ్నుఁడు గాఁడు శఠుండు గాఁడు దు
శ్చరితుఁడు గాఁడు కేవలసృశంసుఁడు గాఁడు కృతోపకారవి
స్మరణయుతుండు గాఁడు నృపసత్తమునాజ్ఞయుఁ దప్పఁ డేటి కి
ప్పరుసున మాట లాడెదవు భానుకులోత్తమ యన్యునిన్ బలెన్.
| 900
|
| ఉ. |
రామునిసత్కృపం బ్లవగరాజ్యము శాశ్వతకీర్తియున్ మహో
ద్దామయశంబు గల్గెఁ గడు ధన్యుఁడ నైతిఁ దదిష్టసిద్ధికై
భూమిజ నింక వే వెదకఁ బుచ్చఁగఁ బోలు నటంచు మాకుఁ దా
వేమఱు నొంటిమై దిరుగువేళలఁ జెప్పు నితండు నిత్యమున్.
| 901
|
| చ. |
మఱచినవాఁడు గాఁడు గుణమండన యీతఁడు రాముకార్యమున్
గుఱుతుగఁ బెద్దకాలమునకుం దగ మీకృప భూరిసౌఖ్యముల్
దిరముగ నబ్బెఁ గానఁ దమి దీఱక యిన్నిదినంబు లిచ్చటన్
వెరవున జాగు చేసె నిది నేరముగాఁ గొన నీకుఁ బాడియే.
| 902
|
| చ. |
క్షితివరపుత్ర మేనకకుఁ జిక్కి మనోభవరాగమత్తుఁ డై
యతులతపోవిశేషమహిమాదికముల్ విడనాడి కానలో
యతి యగుగాధిపుత్రుఁడు దశాబ్దము లెన్నఁడె యొక్కపూఁట గా
నతిచపలాత్ముఁ డైనతపనాత్మజుఁ డి ట్లగు టెంత చెప్పుమా.
| 903
|
| ఆ. |
కాయధర్మగతుఁ డకామసంతృప్తుఁడు, వివిధకష్టములను వేఁగి కామ
నిరతుఁ డైనరవిజునేరంబు సైరించి, యవనివిభుఁడు గాన నర్హుఁ డధిప.
| 904
|
| తే. |
నిశ్చితార్థంబుఁ దెలియక నృపకుమార
ప్రాకృతునిమాడ్కి నీయట్టి భవ్యమతులు
పాప మెంచక భృత్యునిపై నకార
ణముగఁ గోపింతు రయ్య యన్యాయముగను.
| 905
|
| క. |
వివిధధనధాన్యవసువులు, ప్లవంగరాజ్యమును రుమను బదపడి నన్నుం
దవిలి నృపతిప్రియార్థము, రవిసుతుఁడు త్యజించు నని తిరంబుగఁ దలఁతున్.
| 906
|