| వ. |
ఇట్లు కాంతాజనపరివృతుం డై కల్పవృక్షంబుచందంబున నంజలియుతుం డై
తనమ్రోల నిలువం బడియున్నసుగ్రీవు నవలోకించి లక్ష్మణుండు దారుణవా
క్యంబున ని ట్లనియె.
| 885
|
లక్షణుఁడు సుగ్రీవుని దూఱుట
| తే. |
సత్యనిష్ఠయు నింద్రియజయము కృపయు
సత్త్వసంపన్నతయుఁ గృతజ్ఞత్వ మార్త
రక్షణాసక్తి ధాత్రి నేరాజు కొప్పు
నతఁడు సంపూజ్యఁ డగుచు నేపారు సిరిని.
| 886
|
| క. |
ఉపకారు లైనమిత్రుల, కుపకారము సేయఁ బ్రతిన యొనరించి తుదిన్
గృప మాలి తప్పి నడిచిన, చపలాత్మునికంటె శఠుఁడు జగతిం గలఁడే.
| 887
|
| తే. |
మొదలఁ దాను గృతార్థుఁడై పిదప సఖుల, కవని నెవ్వఁడు ప్రతికార మాచరింపఁ
డాకృతఘ్నుఁడు సర్వభూతావలులకు, నిక్కముగ వధ్యుఁ డనిరి వినీతివిదులు.
| 888
|
| సీ. |
అశ్వానృతుండు శతాశ్వహంతయు మఱిగోనృతుండు సహస్రగోఘ్నుఁ డనియుఁ
బురుషానృతుం డగుపురుషాధముం డాత్మహంతయు నిజబంధుహంత యనియు
మొదవును జంపిన మూఢాత్మునకుఁ జోరునకును భగ్నవ్రతునకును బాన
నిరతున కిల నొక్కనిష్కృతి గలదు గా కరయఁ గృతఘ్నుని కదియు లేదు
|
|
| తే. |
మఱియు నట్టికృతఘ్నుండు సిరికి నాయు, వునకుఁ గాక నిరస్తుఁ డౌననియు నిట్లు
మును కృతఘ్నుని గూర్చి సమ్మోద మెసఁగ, నబ్జగర్భుండు గాథలయందుఁ దెలిపె.
| 889
|
| క. |
మొదలఁ గృతార్థుఁడవై పెం, పొదవఁ బతికి హితము సేయకున్నకతన నీ
వదయుఁడ వనార్యుఁడవు దు, ర్మదుఁడవును గృతఘ్నుఁడవు ప్రమాదివి తలఁపన్.
| 890
|
| తే. |
భానుతనయ కృతార్థుండ వైననీకుఁ, గరుణ నకృతార్థుఁ డైనరాఘవునిదేవి
వెనకఁ బుచ్చుట కర్తవ్య మదియెకాక, గ్రామ్యసుఖవృత్తి నిట్లుంట కార్య మగునె.
| 891
|
| క. |
ఘనుఁ డారాముఁడు మిత్రుఁడ, వని నీకై పూని వాలి నతిబలశాలిం
దునిమెం గడు మండూక, స్వనఫణి వని ని న్నెఱుంగఁజాలక యకటా.
| 892
|
| క. |
జనపతికరుణన కాదే, యనుపమసంపదలు గలిగె నటు కాకున్నన్
మునుపటివలె గిరికంధర, ఘనదుర్గములందుఁ జాల గాసిం బడవే.
| 893
|
| క. |
క్షితినాథునికార్యము దు, ర్మతి వై కావింపవేని మచ్చితవిశిఖా
హతిఁ గూల వైచి యిప్పుడె, యతిరయమున వాలిఁ గూడ ననిచెద నిన్నున్.
| 894
|
| తే. |
అతిబలుం డైనవాసవసుతునిఱొమ్ము, వ్రక్కలించిన విశిఖంబు మొక్కవోయె
నని తలంచితొ యవ్వాఁడిమిని గడంగి, నేఁడు నినుఁ ద్రుంపఁగాఁ జాలు నీచచరిత.
| 895
|
| తే. |
రామబాణాభిహతుఁడై పురందరాత్మ, సంభవుఁడు పోయినపథంబు సంకుచితము
గాదు నీకును దత్ప్రతిగ్రహణబుద్ధి, గల్గినను రామవిప్రియకారి వగుమ.
| 896
|