Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

రఘుకులాగ్రణి కే నపరాధ మించు, కైనఁ గావింపఁ బరుషంబు లాడి యెఱుఁగ
నూర కేలకొ నామీఁది గారవంబు, వీడి సౌమిత్రి కలుషించినాఁడు నేఁడు.

825


తే.

సృజనచిత్తుఁ డై రంధ్రంబు వెదకునట్టి, శాత్రవునిచేత లేని దోషంబు లెవ్వి
యైన నామీఁద వినియెనో కానిచో నృ, పాత్మజుం డేల కోపించె నకట నేఁడు.

826


క.

తలపోయఁగ మును నాపైఁ, గలసౌహృద మెల్ల మాని కలుషించుటకుం
గలహేతు వేమొ తెలియదు, విలసద్గుణులార మీరు వివరింపుఁ డిఁకన్.

827


ఆ.

నన్నుఁ బ్రీతిఁ జాల మన్నించి సామ్రాజ్య, మిచ్చినట్టిచంద మెల్ల నాత్మ
దలఁచుకొనిన నాకు దశరథపుత్రుల, వలని సాధ్వసంబు గలుగ దిపుడు.

828


వ.

ఐన నకాలంబునందుఁ గుపితుం డైనమిత్రుండు సంభ్రమంబుఁ బుట్టించుచున్న
వాఁడు సర్వప్రకారంబుల మిత్రుండు సుకరుండై ననుదనె త్త్రిపరిపాలనంబు దుష్క
రం బై యుండుఁ జిత్తంబుల కనిత్యత్వంబు గల్గుటవలన స్వల్పాపరాధంబునం
దైనను బ్రీతి భేదింపంబడు మహాత్ముం డగురామునిచేత మహోపకారంబు గా
వింపం బడియె దానికి సదృశం బైన ప్రత్యుపకారం బేను గావింప సమర్థుండు
గా నందువలన మిక్కిలి విత్రస్తుండ నైతి నని పలికిన సుగ్రీవునివచనంబు విని
వానరపుంగవుం డైనహనుమంతుండు వానరమంత్రు లందఱు వినుచుండ నిజ
తర్కంబున ని ట్లనియె.

829

హనుమంతుఁడు సుగ్రీవునికి లక్ష్మణాగమనకారణముఁ దెల్పుట

సీ.

రవికుమార నరేశ్వరకృతోపకారంబు మానసంబున నీవు మఱవ కునికి
సర్వవిధంబులఁ జర్చింపఁ గడు విచిత్రము గాదు ధీరుఁ డా రామవిభుఁడు
కాంతావియోగశోకపరీతచిత్తుఁడై నీయట్ల తాలిమి నిలుపలేక
సమయకాలము కడచనినంత కీవు రాకున్న మత్తుఁడ వని ని న్నెఱింగి


తే.

ప్రణయకోపంబుచే మీతెఱం గెఱింగి, రమ్మనుచుఁ బంపఁ గ్రుద్ధుఁడై లక్ష్మణుండు
వాఁడి దీపింపఁ జనుదెంచినాఁడు నేఁడు, తెలియ నీయర్థమందు సందియము లేదు.

830


క.

శూరుఁ డగురఘుకుమారుఁడు, సారబలోదారు డైనశక్రతనూజుం
డారయ భవత్ప్రియార్థము, ఘోరరణోర్వీతలమున గూల్చెం గాదే.

831


క.

వానలు వెలిసినపిమ్మట, భూనాథునిసతిని వెదకఁబుచ్చెద ననుచుం
బూని మును పలికి తిప్పుడు, వానలు వెలిసెను శరత్తు వ్రాలఁగఁ జొచ్చెన్.

832


చ.

సరసులు దేఱెఁ దుమ్మెదలు సారసపంక్తులఁ జేరె దిక్కులం
దఱుచుగఁ దెల్పు లూరె హిమధామునితేజము మీఱె మబ్బు లం
బరమున నుండి జాఱెఁ గలభంబులమోహము తీఱె జక్కువల్
సురతముఁ గోరె సూర్యసుత చూచితె శారదకాలసంగతిన్.

833


క.

తఱి యెఱుఁగక రతిసుఖత, త్పరత న్నీ వునికిఁ బ్రణయపరకోపమునన్
ధరణీశుఁ డనుప లక్ష్మణుఁ, డురువిక్రమశాలి వచ్చె నుగ్రుం డగుచున్.

834