Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

వారును దన్నుఁ గాంచి బలవైభవ మొప్ప విశాలసాలగో
త్రారుహశైలశృంగములు దాలిచి మత్తకరీంద్రసన్నిభో
దారశరీరు లై యెదుటఁ తప్పక నిల్చినఁ జూచి భీషణా
కారుఁడు లక్ష్మణుండు శిఖికైవడిఁ గోపము హెచ్చఁ బొల్చినన్.

800


ఉ.

ఆరవివంశవర్యుభయదాకృతిఁ జూచి కపు ల్పురారియో
దారుణమృత్యువో విలయదండధరుండో యటంచు నాత్మలోఁ
గూరిన భీతిచేఁ బురము గొబ్బునఁ జొచ్చి కపీంద్రుమందిర
ద్వారముఁ జేరి లక్ష్మణునిదారుణకోపముఁ దెల్పి రయ్యెడన్.

801


క.

ఆసూర్యజుఁ డేకాంతా, వాసంబునఁ దారఁ గూడి వారక రతికే
ళీసక్తుఁ డౌటకతమున, మోసంబునఁ గీశవరుల మొఱ వినఁ డయ్యెన్.

802


వ.

అంత నవ్వానరులు సచివసందిగ్ధు లై శీఘ్రంబున నగరంబు వెలువడి గిరికుంజర
మేఘాభులును నఖదంష్ట్రాయుధులును ఘోరాకారులును వికృతదర్శనులును
శార్దూలదర్పులును వికృతవదనులును దశశతసహస్రాయుతనాగబలులును
వాయువేగులును సింహపరాక్రములును భానుప్రతాపులును గామచారులు నగు
హరిపుంగవులు నభోంతరంబు నిండ సింహనాదంబులు సేయుచు నగరద్వారంబుల
నాక్రమించి యుదంచితవిక్రమాటోపంబునం బొలిచియుండి రందుఁ గొందఱు
బహిర్ద్వారంబున యువరా జగునంగదుని నక్షత్రంబులు చంద్రునింబోలెఁ బరివే
ష్టించి యుండి రిత్తెఱంగునం గూడికొనినయవ్వానరసైన్యంబుచేత నమ్మహాగు
హమేఘసమూహంబుచేత గగనంబుంబోలెఁ బరిపూర్ణ యై యొప్పె నిట్లు గూడు
కొనిన మహాద్రుమహస్తం బైనకపిసైన్యంబును దురాసద యైనకిష్కింధను
బ్రాకారపరిఘాంతరంబువలన నిర్గమించి సాలతాలపాణులై యుదగ్రవిక్రమం
బున గుంపులు గట్టి పఱతెంచు వీరవానరులనుం జూచి సుగ్రీవునిప్రమాదం
బును రామునివిరహశోకంబును దలంచుకొని దీర్ఘోష్ణమహోచ్ఛ్వాసవదనుం
డగుచు నేత్రంబులం దామ్రదీధితులు నిగుడ సధూముం డగుపావకునిచందం
బున వెలుంగుచు మహావీరుం డగులక్ష్మణుండు శంకింపక నందఱం ద్రోచి
కొని సుగ్రీవపాలిత యైనకిష్కింధఁ బ్రవేశించి రాజమార్గంబునం బోవుచు
ముందట.

803


క.

శ్యామాభ్రసన్నిభంబును, జామీకరవేదికంబు సముదితమణిమా
లామండితంబు దివ్యర, మామహితము నైనయొకవిమానము గాంచెన్.

804


క.

కని యందు గీతవాది, త్రనినాదము వానరీచరణనూపురని
స్వనము పరస్పరహసిత, ధ్వనులును మణిహారకలరవంబులు వినియెన్.

805


వ.

ఇత్తెఱంగున నాకర్ణించుచు.

806


క.

తేజోవిషసంఘాతుఁడు, రాజితశరశల్యవిస్ఫురజ్జిహ్వుఁడు నై
రాజసుతుఁ డొప్పెను ధను, ర్భ్రాజితఫణుఁ డగుచుఁ బంచవదనాహిక్రియన్.

807