Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గాఢసంతమనసంవృతంబు లగుటం జేసి దిక్కులును నిరంతరవారిపూర
పరిచ్ఛన్నం బగుటం జేసి మహీతలంబునుం బ్రకాశింపకున్నయది మఱియు
మహోన్నతంబు లైనశైలశిఖరంబులు నవనారిధారాధౌతంబు లై మహాప్ర
మాణవిపులనిర్ఝరంబులచేత నుపలక్షితంబు లై లంబమానముక్తాకలాపం
బులచేతం బోలె మిక్కిలి యభిరామంబు లై యున్నయవి మఱియు
శైలేంద్రోపరిసంజాతవివులప్రవాహంబులు సర్వతోపలవిశీర్యమాణవేగంబు
లై మత్తమయూరరుతముఖరితంబు లైనగుహాముఖంబునందు విశీర్యమాణ
హారంబులభంగిఁ జూపట్టుచున్నవి మఱియు మహావేగంబు లైనకొన్ని
విపులప్రపాతంబులు నిర్మలీకృతశిఖరిసమీపతలంబు లై ముక్తాకలాపప్రతిమంబు
లై డిగ్గుచు శైలగుహామధ్యప్రదేశంబులచేత ధరింపంబడుచున్నవి సురత
క్రీడాసంఘర్షణవిచ్ఛిన్నంబు లైనదేవతాంగనాహారమౌక్తికంబులవడువునఁ
దోయధారలు నిరంతరంబుగా దిక్కులయందుఁ గురియుచున్నవి నదులకు శీఘ్ర
ప్రవాహంబును ఘనంబులకు నీలిమయు మత్తగజంబులకు ఘీంకారంబులును
వనాంతరంబులకు రామణీయకంబును విరహిణీజనంబులకు రతిధ్యానంబును
మయూరంబులకు నృత్యంబును బ్లవంగంబులకు సమాశ్వసనంబునుం గలిగి
కులాయలీయమానవిహంగమంబులచేతను ముకుళితంబు లగుపంకజంబులచే
తను వికసితంబు లగుమాలతీకుసుమంబులచేతను నిరూప్యమాణసూర్యాస్తమ
యం బై యొప్పునిక్కాలంబునందు.

691


క.

ముదమున బలాకలును వా, రిదసంగతి నొందెఁ గాంత ప్రియునిం జెందెన్
నదు లంభోనిధి నొందెను, బదపడి హరి నిద్రఁ జెందెఁ బార్థివతనయా.

692


క.

జననాథపుత్ర భూసుర, జనముల కిది వేదపాఠసమయము ధరలో
ఘనసామవేదఘోషము, వినవచ్చున్ మధురఫణితి విప్రులయిండ్లన్.

693


క.

సలిలసమీకృతపథములు, గలుగుటచే వైర ముడిగి క్ష్మాపతులు బలం
బుల నిలిపి దండయాత్రకు, నిల నెవ్వరు చనక యుందు రిక్కాలమునన్.

694


తే.

అనఘ సంచితసంచయుఁ డై భరతుఁడు
రమణ నాషాఢశుక్లపూర్ణిమ మొదలుగ
మునుకొని నివృత్తకర్మాయతనుఁడు నగుచు
నూర వ్రత మూని నియతుఁ డై యుండుఁ గాదె.

695


క.

అనఘ సమాయాతుఁడ నగు, ననుఁ గని సాకేతనిస్వనముకైవడి నూ
తనజలపూరితసరయూ, ధునీరయము సాంద్ర మగుచుఁ దోఁచుం గాదే.

696


క.

తమ్ముఁడ యీవర్షాకా, లమ్మున రవిసుతుఁడు రాజ్యలక్ష్మీయుతుఁ డై
యిమ్ముల నాత్మసతీయు, క్తమ్ముగఁ గ్రీడించుచుండుఁ గద గతరిపుఁ డై.

697


క.

ఏ నెంత యభాగ్యుఁడనో, జానకి నెడఁబాసి విగతసామ్రాజ్యుఁడ నై
నానుచు చున్నాఁడ మదిన్, దీనత లోఁగొన్న ఘనధునీతటముక్రియన్.

698