పుట:కేయూరబాహుచరిత్రము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ప్రథమాశ్వాసము

చ. కలితకపోలసాంద్రమదగంధవశభ్రమితాళిమాలికల్
     పలుమఱు మీఁద మూగినబలాహకమై కనుపట్టు శీకరం
     బులు బహునిర్ఘరంబులుగ బొట్లనుజేగురుసూర్యకాంతభం
     గులుగఁ బురంబులోన నడకొండలఁబోలి చరించు నేనుఁగుల్.55
చ. ఒడళులు కానకుండఁ బడియుండెడుగాడ్పులు దీర్ఘపక్షము
     ల్విడిచి ధరంజరించునహివిద్విషు లర్థి ననూక్ష్మరూపము
     ల్వడసినచిత్రము ల్చెదరఁబాఱిన వెల్లనుగూర్చి యొక్కచో
     నిడిన బెడంగుప్రోగు లన నెంతయు నొప్పుఁ బురిం దురంగముల్.56
ఉ. అత్రిసమాను లర్జునసమాధికశూరులు దేవవర్ణినీ
     పుత్రమహాధనుల్ విదురపూర్ణగుణుల్ మదనాయుధోపమా
     పాత్రము లుగ్రసింహనిభబాహుబలు ల్దలపంగ జాహ్మణ
     క్షత్రియవైశ్యశూద్రగణికాసుభటోత్తము లప్పురంబునన్.57
చ. సరసిజపత్రలోచనలచందనచర్చల నొందుచుం దలో
     దరులమొగంపుఁగప్పురపుఁదావులతో సరసంబు లాడుచున్
     దరుణుల గట్టిచన్నుగవఁ దాఁకుచు ధన్యత తన్నుఁ బొందగాఁ
     దిరుగుచు నుండు నింపుగలతెమ్మెర లెప్పుడు నప్పురంబునన్.58
మ. లలనారోహణవాద్యమానబహుడోలాఘాంటికానాదముం
     గలధౌతోజ్జ్వలపంజరాకలితశౌకశ్లోకికారావసం'
     కులముం చంచదమందక్షట్పదపదీకోలాహలంబుల్ కడున్
     దలమై మర్దళదుందుభిప్రభతివాద్యస్ఫూర్తి తోచుం బురిన్.59
చ. దలముగ నెల్లప్రొద్దును లతానివహంబులఁ గాఱుపుప్పొడుల్
     పులినదళంబుపైఁ జెలువు బూనఁగ మీఁదట దేలు కేతకీ
     దళముల మెత్తమోడలవిధంబునఁ దేలగఁ బాఱుఁ బెద్దలై
     ఫలరసవాహినుల్ పురియుపాంతవనంబులఁ గొన్నిచోటులన్.60
వ. అట్టిపురంబున కధీశ్వరుండు.61
చ. దశరథరాముతమ్ముఁడనఁ దాఁదగులక్ష్మణుపుత్రుఁ డై యశో
     వశుఁడగు చంద్రకేతునకు వంశజుఁ డైన మహేంద్రపాలుఁ డా
     శశధర మాదనేశ మనఁజాలుప్రతాపముతో జగంబ క
     ర్కశుఁ డన నేలె నానృపతిగాదిలిపట్టికులావతంస మై.62