పుట:కేయూరబాహుచరిత్రము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

73

     రింపవలసిన పనులకుఁ దత్తదుచితకర్మకారులఁ బనిచి మృగాంకవర్మునకుం గాంతా
     లంకార మలవడంజేయు మని కళావతి నతిప్రయత్నంబున నియోగించి రాజుం
     గైసేయ నభినవప్రసాధనరచనానిపుణు లగు చతురుల కానతిచ్చిన నాప్రొద్దు స
     ర్వం బనుష్ఠితం బై లగ్నం బాసన్నం బగుటయు.182
సీ. సల్లలితాశ్వత్థపల్లవమిశ్రితచారుపల్లవరత్నతోరణంబు
     అసదృశకుంకుమరసలిప్తతలపరివశితముక్తారంగవల్లికంబు
     ఫలపుష్పశుక్తిజప్రాలంబమాలికోదారవిచిత్రవితానకంబు
     రమణీయమంగళద్రవ్యకాంచనపాత్రికాకారపుణ్యాంగనాకరంబు
గీ. విశదవేదఘోషాపూర్ణవిప్రగణము, దీప్తమణికాంతికల్పితదీపచయము
     నగుచుఁ బరిణయమండప మమరియుండ, రాజ్ఞి పనుపున రాజును రాజసుతయు.183
ఉ. చూడ్కులు చూపఱన్ మొరఁగి చొచ్చి కృతార్థతఁ జెందుచుండఁగా
     వేడ్కలు నిక్క నూరటలు వేగము నుల్లము సందియంబునన్
     వీడ్కొలుపం బ్రమోదరసనీరధి దా నిరుమేను లైనయ
     మ్మాడ్కి వహించి చేసిరి సమంత్రకకృత్యములం గ్రమంబునన్.184
వ. అనంతరంబు వేదిస్థలంబునకు వచ్చి హోమం బొనరించుచుండ దేవియు నాప్తపరి
     చారికలును హాసోద్యోగు లగుసమయంబున భాగురాయణుండు సనుదెంచి రత్న
     సుందరి సేయించునుపచారంబులు గైకొని యుచితస్థలంబున నాసీనుండై యాయ
     మ నుద్దేశించి యిట్లనియె.185
గీ. చంద్రవర్మమహారాజుసతి సుధామ, దేవి నీపేర లేఖ పుత్తెంచె ననుచు
     నగరి మొగసాల నొకరుఁడున్నాఁడు వానిఁ, బిలిచి తేరంగ నిప్పుడ వలయుఁబనుప.186
వ. అనుటయు దేవిచేత ననుజ్ఞాతయై యొక్కసతి చని తోడ్తేర వాఁడును దండప్రణా
     మం బాచరించి హరిద్రముద్రం బైనతనచేతిలేఖ యిచ్చినం జదివించె నది
     యెట్లనిన.187
సీ. స్వస్తి సమస్తప్రశస్తిసమేతసుధామమహాదేవి తనతనయకు
     స్వస్తి సమస్తప్రశస్తిసమేతయై పరఁగినరత్నసుందరికిఁ బ్రీతిఁ
     జెప్పు నీ కిపు డొక చిట్టితమ్ముఁడు గల్లె మున్ను నీపురమున నున్న యామృ
     గాంకవర్ముఁడు చెలియలు గాని నీకుఁ దమ్ముఁడు గాడు మగపేరు మ్రోయఁ జేసి
గీ. పెనిచితిమి మేము సుతుఁడు లేకునికి దొల్లి , నిప్పు డక్కన్యఁ దగుపతి కిమ్ము నీవ