పుట:కేయూరబాహుచరిత్రము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

67

     తొడవులకును దనులతకును, నడుపులకుం దొడవు లరయ నాతుక నుడువుల్.134
సీ. వాలుఁగన్నులుఁ జారువదనంబు నుత్పలవనజకాంతుల నుద్దివైచికొనఁగ
     మెఱుగుదంతములు వాతెఱయును మౌక్తికచూతపల్లవముల సూడువట్ట
     భుజములు మృదుహస్తములును లేఁదూండ్లను జెందొవరేకుల సిగ్గుపఱపఁ
     జనుఁదోయి నలకలు జక్కవకవపొందుఁ దుమ్మెదచాయల దొద్దగొనఁగ
గీ. నలిక మరచందురునితోడఁ జెలిమి సేయఁ, దియ్యపలుకులు దేనెలు వియ్యమంద
     నడపు లంచల కొంచదనంబు సేయఁ, గమలగంధి మనోహరాకార మలరె.135
క. ఆచేడియ సౌందర్యము, నాచేఁ జెప్పించుకొని వినఁగ వలసి మదిం
     జూచెదవు గాక ముందఱ, నీచూడనియదియె మేదినీవర చెపుమా.136
వ. అదియె ట్లం టేైని.137
చ. అసదృశతారమౌక్తికసమంజితనాయకరత్న మై సమం
     జసరుచిపుంజ మై తన కుచంబుల మీఁద వెలుంగు హారమున్
     బిసరుహహస్త పుచ్చుకొని పెట్టెఁ బ్రియంబునఁ జేరితే నమః
     ప్రసవశరాసనాయ యని పల్కుచు భూపతి కంధరంబునన్.138
క. అనుపలుకు లమృతము క్రియం, దనవీనులు సొచ్చి డిగి హృదయ మంతయునిం
     డిన నొకపడిఁ దన్నెఱుఁగక, జనపతి పూర్ణానురాగశరనిధిఁ దేలెన్.139
వ. చారాయణుండునుఁ ప్రమోదితహృదయుఁ డగుచుం గళావతి శిరం బక్కున నది
     మి పెక్కుదెఱంగులం బ్రశంసించె నప్పుడు మేదినీనాథుఁడు.140
గీ. బహువిధంబులఁ గొనియాడి బహుళరత్న, భూషణాంబరాదికముల పూర్వముగను
     నొసఁగి యరలేని చెలిమిఁ దీపెసఁగఁ దన్నుఁ గలిపికొనియుఁ గళావతి గారవించి.141
వ. లాటరాజనందన యటమీఁది వృత్తాంతంబు విను కౌతూహలంబుతో నునికి యె
     ఱింగి కళావతి యిట్లనె నట్లు దేవరచే గృహీతయయ్యును నటమున్న నాచే బోధి
     తయగుటం గులపాలికాధవంబైన ధైర్యం బవలంబించి యెట్టకేనియు విడిపించుకొ
     ని తదీయశయనగృహంబు సుషిరస్తంభకుడ్యరచితంబుఁ గావున యంత్రస్తంభాంతరిత
     యైన యంభోరుహవదనను వీడ్కొని తత్సదనంబున నుచితప్రభాతం బగుచుండ నే
     నును మదాలయంబున కఱిఁగి యొకప్రహారమాత్రంబు మసలి మరలి తనయున్న
     తావునకుం బోవ నమ్మానవతియు నంతక మున్న బహువిధమన్మథవికారమగ్నమా
     నస యగుచుండి తన యంతర్గతంబున సకలంబు నాకు వెలిఁబుచ్చ సిగ్గుపడి పద్య
     త్రయంబు గా రచించి యొక్కకేతకీపత్రంబున లిఖించి యేమరి పడవైచినట్లు