పుట:కేయూరబాహుచరిత్రము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

కేయూరబాహుచరిత్రము

చ. అతఁడు సుబుద్ధి గాన దనయన్వయపూర్వులు దొల్లి యేకసం
     తతులయి పోక తా విధికృతం బగుటన్ దనయందుఁ బుత్రహీ
     నత పరదేశరాజులమనంబునఁ బుట్టకయుండనోపి ర
     క్షితముగఁ జేసె మంత్రము బ్రసిద్ధిగ మ్రోసె సుతత్వ మెల్లెడన్.128
వ. ఆయ్యపత్యంబు నామంబు మృగాంకావళి యై యుండ మృగాంకవర్మ యని పుం
     స్త్యంబు దోఁపఁ దదభిధానంబునం బిలుచుచుందు రక్కన్నియఁ బొందినవానికి
     సార్వభౌమత్వంబు కలుగు నని మహాపురుషాదేశంబు, ఈ రహస్యంబు సమస్తంబు
     బుద్ధిమదగ్రేసరుం డగు నీమంత్రి భాగురాయణుండు భవదీయరాజ్యలక్ష్మీసమృద్ధి
     చింతానిరతాత్ముం డగుట నక్కుమారీరత్నంబును వరించి దేవరసౌర్వభౌమత్వంబుఁ
     బొందవలయు నని యొక్కయుపాయంబున నా రాజపుత్రి నిప్పురంబునకు రప్పించి
     తనమందిరంబున నిడికొని రత్నసుందరియందు భయభక్తిసమేతుండగుట నద్దేవివల
     ని దాక్షిణ్యవిశేషంబున నీ కెఱిఁగింపనేరకయున్నవాఁడు భవద్వల్లభ యెరుం
     గకుండ నమ్మహామంత్రినియోగంబున నప్పురంధ్రీభూషణంబునకు నెచ్చెలివై
     వర్తిల్లుదు.129
ఉ. ఆమదిరాక్షి రూపవిభవాతిశయంబుల దృష్టి సోకినన్
     సోముని నైన వేఱ యొకసోముఁడు నామనినైన వేఱ యొ
     క్కామని కమ్మదెమ్మెరలనైనను వేఱొకకమ్మతెమ్మెఱల్
     కామునినైన వేఱ యొకకాముఁడు నేచుదు రేమి సెప్పుదున్.130
మ. వనితారత్నము నాసికాపదభుజద్వంద్వశ్రవోలంకృతుల్
     వనజామోదపుటూర్పు లంచనడుపుల్ వాణిద్యుతుల్ శాతలో
     చనపార్శ్వంబులు దృష్టిదోషమున రక్షల్ నాకుఁ జూడఁగఁ ద
     ద్ఘనముక్తావళి యందియల్ వలయముల్ కళ్యాణతాటంకముల్.131
మ. కరపాదాంబురుహంబులుం గుచరథాంగద్వంద్వమున్ మోముచం
     దురుతో దాయలు ఘ్రాణచంపకము శత్రుల్ కుంతలాళీంద్రసం
     కర మి ట్లక్కట యీవధూసురుచిరాంగశ్శ్రేణి కయ్యెం బర
     స్పరవైరం బని కుంది డస్సె ననఁగా సన్నంబు కౌ నింతికిన్.132
క. నయనాద్యవయవములు మే, లయినపదార్ధములఁ జేసె నజుఁ డవి వోగా
     బయ లావటించి చేసిన, క్రియ నయ్యరవిందగంధినె న్నడు మొప్పున్.133
క. తొడవులకుఁ దొడవు తనులత, తొడవులకుం దనులతకును దొడవులు నడుపుల్