పుట:కేయూరబాహుచరిత్రము.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

65

క. నన్నుఁ మును పీవుఁ గాచితి, నిన్నుం జెఱ కేను వాపి నిలిపితి నాకై
     మున్ను గల కరుణ మఱవక, మన్నింపుము నాకు నంత మానమ చాలున్.117
గీ. వియ్యమందఁ బోక కయ్య మొనర్చుట, చెలిమిసేఁత తమకుఁ దలము గాని
     వారితోడఁ దగదు వలదు నీచెలిమికి, నేను హీనబలుఁడ నెంతవాఁడ.118
క. మున్నీవు నాకు వైరివి, మిన్నక కార్యార్థమాత్రమిత్రత్వమున
     న్నన్ను సహింపుదువే చను, మిన్నిపలుకు లేల వెఱతు నే నిను జేరన్.119
వ. అనుటయు నయ్యహి సిగ్గువడి పోయె నమ్మూషకంబును సుఖంబున నుండె నని
     చారాయణుం డెఱింగించెఁ దనవలన మహీనాథవృత్తాంతంబు సమస్తంబు విని
     భాగురాయణుండు కఱపి పుత్తేరఁ గలావతి యొక్కనాఁడు రత్నసుందరి పను
     పునెపంబునఁ గేయూరబాహుభూధవుండు చారాయణసహితుఁడై యుండునె
     డ కేతెంచి మ్రొక్కిన దేవీప్రేరితయై యది తనభావవృత్తి యరయవచ్చినదిగాఁ
     దలంచి ప్రసంగవాక్యంబుల నింగితంబు నొడిచికొని ధరణీశుండు దానిం గార
     వించి యాసీనంగా నియమించిన నది యట్ల చేసి వారి నుద్దేశించి సస్మితానన యై
     యి ట్లనియె.120
క. మీయాడెడు నేకతమున, నాయతనము నృపతియఱుత హారం బది నా
     చేయార గ్రుచ్చినది మీ, రేయెడ మొఱఁగెదరు నన్ను నీనేరుపులన్121
వ. అనుటయు ధాత్రీనాథుం డాశ్చర్యసందేహసంతోషంబులు మనంబున ముప్పి
     రిగొనుచుండ ని ట్లనియె.122
క. చారాయణుఁడును నీవును, నారయ సరి నాకు నిట్ల యాడెదు నీకే
     వారింతునె యేకత మీ, హారం బెవ్వరిది మొదల నంగన చెపుమా.123
వ. అనుటయు నెఱింగించెద నవధరింపు మని యి ట్లనియె.124
క. భూవర యొప్పును లాట, క్ష్మావల్లభపుత్రి నఖిలజనలోచన సౌ
     ఖ్యావహలావణ్య మృగాం, కావళి యను కన్య హృదయహారిణి యగుచున్.125
వ. అనుపలుకు విని కేయూరబాహుమహీపాలుండు కళావతితో లాటేశ్వరుం
     డగు చంద్రవర్మకు మృగాంకవర్మ యను పుత్రుం డొక్కరుఁడు కాక పుత్రి
     యెక్కడిది యనిన నది నగుచు నలుదిక్కులుం బరికించి యిది యొక్క యత్యం
     తరహస్యంటు దాని నియమం బవధరింపు మని యిట్లనియె.126
క. ధాత్రీశ లాటపతి యొక, పుత్రిం గని పుత్రనామమున వెలయించెన్
     శత్రుకులసమీకరనా, స్యత్రాణప్రౌఢకౌశలాలసుఁ డగుచున్.127