పుట:కేయూరబాహుచరిత్రము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

57

చ. మెలఫున దాఁటియాడు మగమీలవిలాసము దోలి వ్రాలి కం
     దలపపుచాయ మీఱి వెలిదామరఱేకులతెంపు నవ్వుచుం
     గలువలకాంతి గైకొనక కాఱుమెఱుంగులఁ బోలి నేత్రము
     ల్చెలువకు నొప్పు ముత్తియపుఁజిప్పలపాటికి నింతపెద్దలై.32
క. కమలానన కన్నులు ని, క్కమనుకు దొనలోనఁ బొలుచు కామునిశితబా
     ణములగు న ట్ కర్ణాం, తములును భ్రూచాపసంశితంబులు నగుటన్.33
ఉ. ఇంచుక నాపయిం బొలసె నిందుకరావళి ముంచి తెచ్చి పై
     నంచినపోల్కిఁ బువ్వువల వైచిన చాడ్పునఁ గల్వదండ సా
     రించినలీలఁ దమ్మివిరి ద్రిప్పినభంగి మెఱుంగుఁదీఁగె గ
     ప్పించినమాడ్కి వాలు జళిపించినకైవడి నింతినేత్రముల్.34
వ. ఆసమయంబున శయనతలంబున నాసీనుం డైన నన్నుఁ గదియఁ జనుదెంచి.35
చ. జలరుహగంధి తామధురచారుసుధారస మర్థి నాదునీ
     నులఁ జిలికించుచుం దనచనుగవమీఁద వెలుంగు నొక్క యు
     జ్జ్వలతరహారవల్లి గరువంబున నామెడఁ జేరి పెట్టెఁ గో
     మలకరపల్లవద్యుతిసమాజము మత్తనువెల్ల బర్వఁగన్.36
వ. అయ్యవసరంబున.37
చ. తను నెఱుఁగం దలంచి ప్రమదంబున బాణిసరోరుహంబు వ
     ట్టినఁ గని రత్నసుందరికి డెందములో వెఱతంచుఁ గోమల
     ధ్వని ననుఁ బల్కి కన్నుల నదల్చుచు నాదుమనంబుతోనఁ గ్ర
     క్కునఁ దనహస్తముం దిగిచికొం చరిగెన్ లలితాంగి మెల్పునన్.38
క. అత్తఱి వెనువెనుకన చన, నత్తరుణి యదృశ్య యయ్యె నచ్చెరువు వయ
     స్యోత్తమ యప్పటినుండియుఁ, జిత్తంబున సందియంపుఁజీఁకటిఁ బడితిన్.39
చ. కల యగునొక్కొ యొండె కల గా దిది నిక్కమ యొక్కొ నిక్కముం
     గలయును బొత్తునం గలయఁ గ్రాఁగిన చందమొకో నిజంబు గాఁ
     గల యగునేని నున్నదిదె కంఠము హారము నిక్క మైన న
     క్కలికి వెడందవాలుఁదెలిగన్నులసుందరి యేది ముందఱన్.40
వ. అని యిట్లు మదనవికారభ్రాంతిపూర్ణస్వాంతుం డైన మేదినీకాంతుం గనుంగొని
     సంతసిలుచు రత్నసుందరీసౌభాగ్యగర్వాపహరణక్రియాచింతైకపరాయణుం డగు
     నాచారాయణుం డాత్మగతంబున.41