పుట:కేయూరబాహుచరిత్రము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

55

     ఖకు సరియైన లాటనృపకన్యకఁ గాంచె విభుండు భ్రాంతితోన్.12
ఉ. చూపులు మేన నంతటను సోఁకినచోటన నిల్చెఁ జెల్వపుం
     దీపులు గ్రోలఁ గోరికలు దీఱిన వీనులు మంజుకోమలా
     లాపరసామృతంబును దలంబుగ నింపుల కాససేయ న
     భ్భూపతి లాటభూమిపతిపుత్రిక యొప్పునఁ జిక్కెఁ దద్దయున్.13
క. నిగుడుచు మగుడుచు నుండెను, మగువమెఱుఁగుఁ జూపుగములు మగుడక పటలం
     బుగ నందు విభుని చూడ్కుల, తగులుత నొండొరులమీఁద దలముగఁ బర్వెన్.14
వ. ఆసమయంబున15
చ. అసదృశతారమౌక్తికసమంజసనాయకరత్న మై సమం
     జసరుచిపుంజమై తనకుచంబులమీఁద వెలుంగు హారముం
     బిసరుహహస్త పుచ్చుకొని పెట్టెఁ బ్రియంబునఁ జేరితే నమః
     ప్రసవశరాసనాయ యని పల్కుచు భూపతికంధరంబునన్.16
వ. అప్పుడు.17
మ. కరమూలంబున మించుఁ బొంచులిడి కాంక్షంగ్రోలుఁ గప్పారు ముం
     గురు లర్థిం గబళించు వాతెరమెఱుంగు ల్దొద్దలాడుం బయో
     ధరకుంభంబుల నెక్కు డిగ్గు నొలుపొంద న్నీవికల్గుం దలో
     దరినాభీనవదీర్ఘికంబొలుచు నద్ధాత్రీశుచూడ్కు ల్వెసన్.18
చ. ఎలుఁగు వినంగ నుబ్బి కమలేక్షణచేతులసొంపు గాంచి స
     ల్లలితశుభాంగకంబులవిలాసము లాదటవోవఁ గ్రోలి దే
     హలతికగంధమూని యిటులన్నియుఁ బండువు సేసె నింద్రియం
     బు లొకఁడుఁ దక్కకుండ మది భూపతి కేఁకట వొందుచుండఁగన్.19
క. ఆసమయంబునఁ బుష్పశ, రాసనుచే నలసి తగవు నవుల జరపుచున్
     దా సజ్జ డిగ్గి ధైర్య, వ్యాసంగం బెడలి నృపతి యతివఁ దరియుచున్.20
ఉ. ఎవ్వరిదాన వీవు హరిణేక్షణ యెయ్యది నీకుఁ బేరు నీ
     న్నెవ్వతె తెచ్చెఁ జెప్పు మిది యేర్పడ బంటుగ నన్ను నేలు మం
     చవ్వసుధేశ్వరుం డతివహస్తము వట్టిన పట్టి ధైర్యమున్
     ద్రవ్వెడు కన్నులం గొని యదల్చి వదల్చె గరంబు చయ్యనన్.21
వ. ఆలోన మఱియును.22
గీ. రత్నసుందరి దోడుదు రాజ నీవు, వలదు మమ్మేల పట్టెదు తొలఁగు మనుచుఁ