పుట:కేయూరబాహుచరిత్రము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేయూరబాహుచరిత్రము

3

     అలకాధిపతి నిధు లన్నియు వెలివీటి విడిసినక్రియఁ బణ్యవీథికలును
     ధాత మేదిని మిన్నుఁ దఱఁగివైచినమాడ్కి గనుపట్టు బహుతటాకములు సొంపు
గీ. నుపవనంబులు సరసులునొప్పుచేయు, చెఱకుఁదోఁటలుఁ బ్రాసంగుచేలు మెరయ
     నఖిలవిభవంబులకు నెల వగుచు మోయు, ధనదుపురమున కెనయనఁ దనదుపురము.
గీ. మంటికడవ నులకమంచంబు పూరిల్లు, నూలిచీర రత్నకీలితంబు
     గానిపైఁడితొడవు గలుగు టెఱుంగరు, దనదుపురములోనిజనము లెల్ల.19
శా. ప్రాగ్దిక్పశ్చిమదక్షిణోత్తరదిశాభాగప్రసిద్ధక్షమా
     భుగ్దర్పాంతకుఁ డేలెఁ గొంకవిభుఁ డీభూచక్ర మక్రూరతన్
     వాగ్దేవీస్తనహారనిర్మలయశోవాల్లభ్యసంసిద్ధితో
     దిగ్దంతిశ్రవణానిలజ్వలదటత్తీవ్రప్రతాపాఢ్యుఁడై.20
క. ఆవిభునకుఁ బ్రెగ్గడయై, భూవలయంబున యశోవిభూషణుఁ డయ్యెన్
     గోవిందనప్రధానుం, డావాసము గౌతమాన్వయం బాయనకున్.21
మ. విహితాస్థానములందుఁ జూపుఁ దగఁ గోవిందాభిధానప్రభుం
     డహితోర్వీధరవజ్రి గొంకవిభురాజ్యాధిష్టి యై సంధివి
     గ్రహముఖ్యోచితకావ్యసంఘటనవాక్ప్రౌఢత్వమున్ బాఢస
     న్నహనోదగ్రరిపుక్షితీశబహుసైన్యధ్వంసనాటోపమున్.22
క. ధీరుం డాగోవిందన, కూరిమినందనుఁడు వెలసెఁ గొమ్మన గొంక
     క్ష్మారమణున కుదయించిన, వీరుఁడు రాజేంద్రచోడవిభుప్రెగ్గడ యై.23
సీ. నవకోటిపరిమితద్రవిణ మేభూపాలుభండారమున నెప్డు బాయ కుండు
     నేకోనశతదంతు లేరాజునగరిలో నీలమేఘంబులలీలఁ గ్రాలు
     బలవేగరేఖ నల్వదివేలతురగంబు లేనరేంద్రునివాగె నెపుడుఁ దిరుగుఁ
     బ్రతివాసరంబు డెబ్బదియేనుపుట్లు నే, యే విభుమందల నెపుడుఁ గల్గు
గీ. నట్టి యధికవిభవుఁ డగుకులోత్తుంగరా, జేంద్రచోడనృపతి కిష్టసచివ
     తంత్రముఖ్యుఁ డనుఁగుమంత్రి గోవిందనం, దనుఁడు కొమ్మనప్రధానుఁ డొప్పు.24
ఉ. ఇల వెలనాటిచోడమనుజేంద్రునమాత్యత యానవాలుగా
     గులతలకంబుగా మనినకొమ్మనప్రెగ్గడ కీర్తిమాటలన్
     దెలుపఁగనేల తత్క్రియఁ బ్రతిష్ఠిత మైనతటాకదేవతా
     నిలయమహాగ్రహారతతి నేఁటికి నెల్లెడఁ దాన చెప్పఁగన్.25
సీ. రమణీయ మైనకూర్మగ్రామమునయందు గురుదుర్తిపురమునఁ గ్రొత్తచర్లఁ