పుట:కేయూరబాహుచరిత్రము.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

కేయూరబాహుచరిత్రము

ప్రథమాశ్వాసము

ఉ. శ్రీ వసియించుఁగాత సుఖసిద్ధివహించి యనేక బంధుహం
     సావళియుం బ్రహృష్టిరతిశాంతిసముత్కరషట్పదంబుపై
     జీవన మెప్పుడున్ సుకవిసేవ్య మనం బొగడొందు సర్వపు
     ణ్యావహ మైనగుండసచివాగ్రణిగేహసరోవరంబునన్.1
చ. కరిముఖుఁ డస్వినుల్ శ్రుతులు కంజసముద్భవుమోము లంబికే
     శ్వరుమొగముల్ తదాత్మజునివక్త్రము లాదిమునీంద్రమండలం
     బురగపతుల్ గ్రహంబులు పయోరుహనాథుఁడు తారకంబులున్
     బొరిఁబొరి నెల్లసంపదలు పోలమగుండని కిచ్చుఁగావుతన్.2
మ. శ్రవణానందనభారతీచతురునిం బ్రాచేతసుం దివ్యు స
     త్యవతీవందనుఁ గాళిదాసుఁ గృతికర్తన్ గొల్చి వాక్పూర్ణమే
     రువులన్ నన్నయభట్టుఁ దిక్కకవిచంద్రున్ భక్తితోఁ గొల్చి యు
     ద్ధవచాణక్యయుగంధరాదినయవిద్యాకోవిదధ్యాని నై.3
వ. ఇట్లు కృతిప్రారంభకర్తవ్యంబు లాచరించి యున్నవాని.4
సీ. తనపేరిసొబగు మేదిని నెల్లవారికి వీనుల కమృతంపువాన గురియఁ
     దనునాశ్రయించిన జనులమందిరములు తోమ్మిదినిధులను దొంగలింప
     దనకీర్తికామిని యనిశంబుఁ గైసేసి యేడుసంద్రములందు నీడఁజూడ
     దనయొప్పు చూచుకాంతల కొండుమారుండు లేఁ డనుబుద్ధి గల్లించుచుండ
గీ. నెగడు బ్రహ్మవంశనీరధిసంపూర్ణ, చంద్రముఁడు కళావిశారదుండు
     నైజధార్మికుండు నండూరిగుండన మంత్రినిఖిలమంత్రిమండనంబు.5
వ. నిరంతరసరసగోష్ఠీనిష్ఠుంకు గావున నొక్కనాఁ డుచితకథాశ్రవణప్రసంగంబున.6
క. ఈనయిష్టసఖుని విద్వజ్జనమాన్యుని నుభయకావ్యసరణిజ్ఞుని మం
     చననామధేయు నన్నుం గనుఁగొని యి ట్లనియె వినయగౌరవ మెసఁగన్.7
గీ. నందనుఁడు వనమ్ము నట్టిల్లు నిధి సురగృహము చెరువు మేలికృతి యనంగ
     జగతి వెలయు సప్తసంతానములు వినఁ బుణ్యములు యశంబుఁ బొందవచ్చు.8