60
కృష్ణమూర్తి తత్వం
కంపవైపు బాగా పరీక్షించి చూడండి. దానిని తట్టుకోవాలని ప్రయత్నం చేయకండి, నిరాకరించకండి, 'దీనితో నేను ఏం చేయాలి' అని అనకండి. వాస్తవం ఏమిటంటే స్వీయానుకంప వున్నది. వాస్తవం ఏమిటంటే మీరు ఒంటరిగా వున్నారు. ఆ వాస్తవం వైపు సూటిగా చూడగలరా? నిన్న మీ వద్ద డబ్బు వున్నప్పుడో, ఆ మనిషి వున్నప్పుడో, ఆ శక్తి సామర్ధ్యాలు వున్నప్పుడో- ఆది ఏదయినా సరే- అప్పుడు ఎంత బ్రహ్మాండమైన భద్రతలో వున్నారు అనేదానితో పోల్చి చూడకుండా, ఊరికే దానివైపు చూడండి. అప్పుడు స్వీయనుకంపకు ఏ మాత్రం స్థానం వుండదని గ్రహిస్తారు. అట్లాగని ఆ పరిస్థితిని వున్నదున్నట్లుగా మీరు స్వీకరించాలని కాదు.
దుఃఖానికి గల ఒక కారణం మనిషిలోని విపరీతమైన ఒంటరితనం. మీకు చాలామంది స్నేహితులు వుండవచ్చు. ఎంతోమంది దేవుళ్ళుండచ్చు. గొప్ప జ్ఞానం మీరు సంపాదించి వుండచ్చు, అంతూ పొంతూ లేకుండా రాజకీయాల గురించి కబుర్లు చెప్పుకుంటూ, అనేకమైన సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటూ వుండచ్చు-చాలా మంది రాజకీయ వేత్తలు కబుర్లతోనే కాలక్షేపం చేస్తుంటారు. అయినా కూడా యి ఒంటరితనం అట్లాగే వుండిపోతుంది. అందువల్ల జీవితానికి ఒక విశిష్టతను ఆపాదించేవి, మానవుడు ఒక అర్థాన్నీ, ఒక ప్రత్యేకతను కని పెడతాడు. ఇంకా ఒంటరితనం అట్లాగే మిగిలి పోతుందీ. ఆందుకని, పోల్చి చూడటం అనేది లేకుండా ఆ ఒంటరితనంవైపు బాగా పరికించి చూడగలరా? దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించకుండా, దానికో ముసుగు వేయాలనుకోకుండా, పారిపోవాలని ప్రయత్నించకుండా, వున్న దానిని వున్నట్లుగా చూడగలరా? అప్పుడు ఒంటరితనం పూర్తిగా విభిన్నమైన మరొకటిగా మారడం చూడగలుగుతారు.
మనిషి ఒంటరిగానే వుండాలి. కాని మనం ఒంటరిగా లేము. వేలకొద్దీ ప్రభావాలు, వేలకొద్దీ నిబద్ధీకరణాలు, మానసికమైన వారసత్వాలు, సిద్ధాంత ప్రచారాలు, సంస్కృతులు- యివన్నీ కలసి ఏర్పడగా వచ్చిన ఫలితమే మనం. మనం ఒంటరిగా లేము. అందువల్ల మనల్ని నకలు మనుష్యులని అనవచ్చు. ఒకరు ఒంటరిగా వున్నప్పుడు, సంపూర్ణమైన ఒంటరి తనంలో వున్నప్పుడు, వారికి ఒక కుటుంబం వుంటే వుండచ్చు గాక, కాని ఆ కుటుంబానికి చెందినవారుగా వారు వుండనప్పుడు, ఒక దేశానికి గాని, ఒక సంస్కృతికి గాని, ఒక ప్రత్యేకమైన నిబద్ధతకు గానీ చెందినవారుగా వుండనప్పుడు- తాము దేనితోనూ సంబంధంలేని వారం- ఏ తత్వంతోను, ఏ కార్యక్రమంతోను ఏ కుటుంబంతోను, ఏ దేశంతోను సంబంధంలేని వారం అనే భావం కలుగుతుంది. ఈ విధంగా పరిపూర్ణమైన ఒంటరితనంలో వున్నవారే సహజస్వచ్ఛత్వం గల అమాయకులుగా వుంటారు. ఈ అమాయకత్వమే మనసును దుఃఖం నుండి విముక్తం చేస్తుంది.