పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

51

స్థాయిలో వుండే తృప్తిని దేవుడు అని పిలుచుకుంటాడు. కాబట్టి, మనకు, ఎప్పుడూ ఏదో అందుకోవాలనే ఆరాటమే, వెతుకులాటే. ఏదో లోటు వున్నట్లుగానే మనం ఎప్పుడూ భావిస్తూ వుంటాం. అందుకని, మనలో వున్న ఆ శూన్యాన్ని నింపాలని ప్రయత్నిస్తాం. ఆ ఒంటరితనాన్ని, ఆ ఖాళీతనాన్ని, ఆ అలసిపోయిన, శక్తిని హరించివేస్తున్న, అర్ధవిహీనమైన బ్రతుకుని రకరకాల భావాలతో, సార్థకత్వాలతో నింపాలని ప్రయత్నిస్తాం. చిట్టచివరికైనా ఒక మార్పులేని, ఎప్పటికీ స్థిరంగా వుండిపోయే శాశ్వతమైన దానిని అందుకోవడంలో తృప్తి సాధించాలని కోరుకుంటాం. ఇక ఆ శాశ్వతమైన స్థితికి వేయి పేర్లు పెడతాం. దేవుడనీ, సమాధి అనీ యింకా అవీ యివీ; ఇంకా ఎన్ని కొత్త పేర్లయినా కని పెట్టచ్చు. అంతులేకుండా మనం వెతుక్కుంటూనే వుంటాం. ఎందుకు వెతుకుతున్నామో మనల్ని మనం ఎన్నడూ ప్రశ్నించుకోము. సుస్పష్టంగా కానవచ్చే సమాధానం ఏమిటంటే- మనం అసంతృప్తిగా వున్నాం, సంతోషంగా లేము, దౌర్భాగ్యకరమైన స్థితిలో, యితర్ల ప్రేమ అనేది ఎరగకుండా, భయపడుతూ వున్నాం. గట్టిగా పట్టుకొని వేలాడటానికి మనకి ఏదయినా కావాలి. మనకి రక్షణ యివ్వడానికి ఎవరయినా కావాలి- ఒక తండ్రి, ఒక తల్లో, ఎవరో ఒకరు. అందుకని మనం వెతుకుతూ వుంటాం. వెతుకుతూ వున్నప్పుడు ఏదో ఒకటి మనకు చిక్కకుండా వుండదు. దురదృష్టవశాత్తూ, వెతుకుతూవుంటే ఏదో ఒకటి మన చేతికి తప్పక దొరుకుతుంది.

కాబట్టి, ముఖ్యమైన విషయం ఏమిటంటే, వెతుక్కోకుండా వుండటం. అర్థమైందా మీకు? ఇంతకాలమూ మీకు వుపదేశించింది ఏమిటంటే- వెతుక్కుంటూ పొండి; సత్యంతో ప్రయోగాలు చేయండి; సత్యాన్ని అన్వేషించండి; దాని వెనకాల పడండి; వెంటాడండి; దానిని అందుకోడానికి పరుగెత్తండి; మిమ్మల్ని క్రమశిక్షణలో, అదుపు ఆజ్ఞల్లో పెట్టుకోండి అని. ఇప్పుడు యింకొకరు ప్రవేశించి “అవన్నీ చేయకండి, వెతకడం మానేయండి" అని అంటున్నారు. వెంటనే అతన్ని వెళ్ళిపొమ్మని చెప్పడమో, మీ ముఖాన్నీ మరో వైపుకి తిప్పుకోడమో సహజంగా మీలో నుంచి వచ్చే ప్రతిచర్య. లేదా, ఎందుకు అతను యీ విధంగా అంటున్నాడు అనేది మీ అంతట మీరే తెలుసుకోవడానికి ప్రయత్నించండి; ఆమోదించ వద్దు, నిరాకరించవదు; కానీ, ప్రశ్నించండి. అసలు మీరు వెతుకుతున్నది ఏమిటి?

మీ గురించి ప్రశ్నించుకొని శోధించండి. మీరు ఏదో వెతుకుతున్నారు. మీ జీవితంలో అంతర్గతంగా మీకేదో లోటుగా అనిపిస్తున్నది- ఒక రకమైన నేర్పు లేదని కాదు, వుద్యోగం చాలా చిన్నదనీ, డబ్బు ఎక్కువ లేదనీ- ఆ స్థాయిలో కాదు. మనం వెతుకుతున్నది అసలు ఏమిటి? మనం ఎందుకు వెతుకుతున్నామంటే, మన లోలోపల, మనకుటుంబం మీదా, సమాజం మీదా, సంస్కృతి మీదా, అసలు మన