x
కృష్ణమూర్తి తత్వం
విక్టోరియా యుగానికి చెందిన ఈ మిత వాదులంతా హేతువాదం పురోగమనం, స్వాతంత్ర్యం, మానవాభివృద్ధి వికాసాలు అనే ఆదర్శాలకు తమని అంకితం చేసుకున్నారు. శాస్త్రీయ చింతనను ముందుకు తీసుకొని వెళ్ళటానికి కంకణం కట్టుకుంది వారి దేశం. పారిశ్రామిక విప్లవం అవతరించడానికి ప్రధాన పాత్ర వహించింది. ఈ నేపధ్యంలో చూస్తే భారతీయ సాంప్రదాయంలో భద్రపరచవలసినంత విలువైనవేమీ వారికి కనిపించలేదు. బ్రిటీషు చరిత్ర పదిహేడవ శతాబ్దపు ఆరంభం నుండీ ‘భౌతికమైన, నీతిపరమైన, మేధాపరమైన’ అభివృద్ధి పధంలో నడిచిన చరిత్ర అనీ, దీనితో పోల్చదగిన పురోగమనం భారతీయ చరిత్రలో కనపడదనీ మెకాలే అభిప్రాయ పడేవాడు. ట్రెవిలియన్ మాత్రం భారతదేశం యొక్క గత చరిత్ర ‘తప్పకుండా’ చదవవలసిందే అని ఒప్పుకున్నాడు. అయితే కేవలం ‘పురాతన విషయాల పరిశోధన’ మీద ఆసక్తి వల్లనే చదవడం జరుగుతుంది అనే అభిప్రాయం వెలిబుచ్చాడు. సామ్రాజ్య సంరక్షకులు అని పిలువబడే వీళ్ళు తమ జాతి భవిష్యత్తే తమను నడిపిస్తున్నదని భావించారు. విక్టోరియా రాణి దర్బారులో ఆస్థానకవి అయిన ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ కూడా అదే భావాన్ని వుద్వేగ భరితమైన యీ కవితలో యిట్లా పొందుపరిచాడు.
దూర తీరాల వెలుగు దీపాల
ఆశలూరించే పిలుపులవిగో
పదండి, పదండి, పయనమై పోదాం
ఘల్లున మారుమ్రోగే నవ్య నూతన పధాలలో
ఆగదు, యీ మహా ప్రపంచపు గమనం ఆగదు.
భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానాన్ని, యింగ్లీషు భాషనీ ప్రవేశ పెట్టడంలో విజయం సాధించిన వారితో అందరూ ఏకీభవించారని చెప్పలేము. సంస్కృత కళాశాల స్థాపకులు, ప్రాచ్యతత్వాన్ని బాగా అధ్యయనం చేసినవారూ, గౌరవనీయులూ అయిన హెచ్. హెచ్. విల్సన్ వంటి కొందరు నవభారత నిర్మాణానికి కావలసిన విషయ సామగ్రి అంతా ఆ దేశపు గత చరిత్రలోనే లభిస్తుందని విశ్వసించారు. యూరపు నుంచి వచ్చిన విజ్ఞానశాస్త్రమూ, పాండిత్యమూ భారతదేశం తన గత వైభవాన్ని పునర్నిర్మించుకోవడానికీ, తిరిగి తన ‘మేధాపరమైన, నీతిపరమైన అభివృద్ధి’ని సాధించడానికీ వినియోగపడాలనీ విల్సన్ పదే పదే హెచ్చరించాడు. ఇరు పక్షాల వారూ కూడా సమాజ పురోగతికి పాశ్చాత్య శాస్త్రీయ విధానమూ, హేతువాదమూ ఎంతో లాభదాయకాలని వప్పుకున్నారు. ఇది మెకాలే ఆధునిక శాస్త్రాన్ని మధ్యయుగాల సిద్ధాంతాలతో పోల్చి తారతమ్యాలు చూపడంలోను, విల్సన్ సంస్కృత కళాశాల పాఠ్య