పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కృష్ణమూర్తి తత్వం

దుఃఖం అనే అంతూ దరీలేని ప్రవాహంలో కొట్టుకొని పోతాం అని నాకు అనిపిస్తున్నది. సుఖాన్ని అవగాహన చేసుకోవడం అంటే దానిని తృణీకరించడం కాదు. ఎందుకంటే సుఖం, సంతోషం లాగే జీవితంలోని ప్రాధమిక అవసరాల్లో ఒకటి. అందమైన ఒక వృక్షాన్ని చూసినప్పుడు, చక్కని చిరునవ్వుతో వెలిగే ముఖాన్ని చూసినప్పుడు, ఆకు మీద మెరిసే కాంతిని చూసినప్పుడు, మీరు నిజంగానే చాలా సంతోషపడతారు. అందులో గొప్ప వుల్లాసం వున్నది.

సౌందర్యం అనేది వేరు. అది సుఖం కాదు. సౌందర్యానుభూతి ఒక భవనంలో కాని, ఒక వర్ణ చిత్రంలో కాని, ఒక కవితలో కాని, ఒకరి చేతిలో ఒకరు చేయివేసి వుండటంలో కాని, ఒక పర్వతాన్నో నదినో పరికించి చూడటంలో కాని వుండదు - ఇవి ఎంత సుఖాన్నిచ్చేవయినా కేవలం యింద్రియాను భూతులు మాత్రమే. సౌందర్యం అంటే యిందుకు పూర్తిగా విభిన్నమైనది. సౌందర్యం అంటే ఏమిటో, మేధోపరంగా కాదు, మాటల్లో కాదు. నిజంగా అర్ధం చేసుకోవాలంటే, సుఖం అంటే ఏమిటి అన్నది అవగాహన చేసుకోవాలి.

చూడండి, మానవుడు సుఖాన్ని త్యజించాలని ఆదేశించడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది. మతం ద్వారానో, ఒక భావనను ఆరాధించడం ద్వారానో, మహాత్ములు, మత ప్రచారకుల ద్వారానో, సన్యాసులు, బైరాగుల ద్వారానే యిదీ జరుగుతున్నది. వీళ్ళంతా అదే పనిగా పెట్టుకొని మనిషిని సుఖాన్నుంచి దూరం చేశారు. సుఖపడటం తప్పనీ, అది దుర్మార్గమనీ, దాని నుంచి దూరంగా వుండాలనీ వాళ్ళు అంటారు. సంతోషంతోనే నిండిపోయివున్న మనసు, సుఖం కోసం వెతుక్కునే మనసు పరమసత్యాన్ని, దేవుణ్ణి ఏనాటికీ కని పెట్టలేదనీ, అందువల్ల మనిషి తనను తాను హింసించుకోవాలనీ వీళ్ళు అంటారు. అయితే అటువంటివాళ్ళు దేవుణ్ణి చేరేటప్పుడు వక్రమైపోయిన, చిత్రహింసలకు గురియైన, అల్పమైన, చిన్న మనసుతో వస్తారు. వాళ్ళది సమాజం చేత, సంస్కృతి చేత పీల్చి పిప్పిచేయబడిన మనసు. అటువంటి మనసు స్వేచ్ఛతో, సజీవత్వంతో, తొణికిసలాడే ప్రాణంతో, శక్తి సామర్థ్యాలు కల, భయరహితమైన మనసుగా ఎప్పటికీ అవలేదు. చాలావరకు మనుష్యుల మనసులన్నీ చిత్రహింసలకు లోనయినవే. వాళ్ళకు అది తెలియక పోవచ్చు. వాళ్ళకా ఎరుక లేకపోవచ్చు. కుటుంబ జీవనంలో, జీవనభృతి సంపాదించుకోవడంలో, వున్నత స్థితిని అందుకునే ప్రయత్నంలో ఎంతగా వాళ్ళు మునిగి పోయి వుంటారంటే, వాళ్ళ ఆస్తిత్వంలో ఏయే విషయాలున్నాయనే స్పృహ వాళ్ళకే లేకపోవచ్చును.

మనిషి ఎప్పుడూ ఏదో ఒక దానికోసం వెతుక్కుంటూ వుంటాడు. ఒక ఆశయాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక తృప్తిని అందుకోవాలని కోరుకుంటూ వుంటాడు. అత్యున్నతమైన