పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

45

తుంది. పరధ్యాసగా వుండటం అన్నది లేనే లేదు. ఎందుకంటే, మనసు ఎక్కడికో సంచారానికి వెళ్ళి పోయిందంటే, అది ఆ మరొకదాని మీద ఆసక్తి చూపుతున్నదని సూచిస్తుంది.

కాబట్టి, అదుపు ఆజ్ఞల్లో వుంచడం అనే మొత్తం ప్రశ్నని మీరు అర్ధం చేసుకోవాలి. అయితే, దురదృష్టవశాత్తు సమయం సరిపోదు కాబట్టి యీ సాయంత్రం ఆ విషయాన్ని చర్చించలేము. మానవులం అనుకునే మనమంతా అదుపులో వుంచబడిన, నిర్జీవమైన వట్టి సత్వాలం. అయితే దీని అర్థం మనకి యిష్టమైనవి నిరాఘాటంగా చేసెయ్యాలని కాదు- నిజానికి యిది రహస్యంగా మనం చేస్తూనే వుంటాం. అయితే ప్రేమలోనే ఒక క్రమశిక్షణ కూడా వుంటుంది. అది ఏమిటో క్లుప్తంగా వివరిస్తాను.

ధ్యానం అంటే ఆలోచనలను అదుపులో పెట్టడం కాదు. ఆలోచనలను అదుపు చేసినపుడు ఆ ధ్యానం మనసులో సంఘర్షణను పెంచిపోషిస్తుంది. అయితే, యిప్పుడే మీకు విశదపరచినట్లుగా, మీరు కనుక ఆలోచన స్వరూపాన్ని, ఆలోచన పుట్టుకను అవగాహన చేసుకుంటే, అప్పుడు ఆలోచన మధ్యలో కల్పించుకోకుండా వుంటుంది. అందువల్ల, ఆలోచనకు వుండే స్థానం ఆలోచనకు వున్నది అని మీరు గ్రహిస్తారు-అంటే మీరు ఆఫీసుకి వెళ్ళాలి, మీ యింటికి మీరు తిరిగివెళ్ళాలి, ఒక భాష మాట్లాడాలి మొదలైనవి. అక్కడ ఆలోచన తన పనిని నిర్వహించాలి. అయితే, ఆలోచించడం అనే మొత్తం సంవిధానాన్ని అంతటినీ మీరు కనుక అవగాహన చేసుకుంటే, ఆ ఆలోచనా స్వరూపపు అవగాహనే దానిని క్రమశిక్షణలో వుంచుతుంది. ఇది అనుకరణ చేయడం కాదు, అణచివేయడం అసలే కాదు.

ఒక హిందువుగానో, ఒక ముస్లింగానో, పార్శీగానో, క్రిస్టియనుగానో, కేథలికగానో, కమ్యునిస్టుగానో ఒక నిర్ణీతమైన పద్ధతిలోనే కొనసాగుతూ వుండటానికి మెదడులోని కణాలు నిబద్ధీకరణం చెంది వున్నాయి, ఎన్నో శతాబ్దాలుగా మెదడు పొందిన యీ నిబద్దీకరణం వల్ల చేసినదే మళ్ళీ పునరుక్తి చేయడం అనే పద్ధతిలో మెదడు పడిపోయింది. అందువల్ల యీ మెదడు ఒక నిరంతరమైన విచారణకు మళ్ళీ తానే ప్రధానపాత్ర వహిస్తున్నది. వివరంగా చూస్తే మీరే స్వయంగా అది తెలుసుకుంటారు.

కాబట్టి, సమస్య ఏమిటంటే మెదడు కణాలలోనే అత్యంతమైన ప్రశాంతతను తీసుకొని రావాలి. అంటే, 'నేను' కు గుర్తింపు కోసం తాపత్రయపడటం, నేను భావాన్ని కొనసాగించుకోవడం మానాలి, అర్థమైందా మీకు? భౌతికమైన స్థాయిలో మనం బ్రతికి వుండాలి, మానసిక స్థాయిలో మృతి చెందాలి. మానసికమైన స్థాయిలో వేలాది నిన్నలు మరణించడం జరిగినప్పుడే మెదడులోని కణాలు నెమ్మదిని పొందగలుగుతాయి.