పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

కృష్ణమూర్తి తత్వం

అయితే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం జరిగాక ఆ ప్రశ్నను మీరు అడగచ్చు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే తప్ప, మీ గురించి మీకు అవగాహన వుంటే తప్ప, ఎంతగా సాధ్యపడుతుందో అంతగా మిమ్మల్ని మీరు పరికించుకుంటే తప్ప, 'ధ్యానం అంటే ఏమిటి' అని మీరు అడగకూడదు. “మిమ్మల్ని మీరు పరికించుకోవడం” ఆ క్షణంలోనే జరిగిపోతుంది. ఆ క్షణంలోనే మీ సర్వస్వమూ విశదమవుతుంది, కాలం గడిచాక కాదు. ఒక చెట్టుని, ఒక పూవునీ, మీ పక్కనే వున్న ఒక మనిషిని మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. ఆ చెట్టు గురించి, ఆ మనిషి గురించి ఒక మనోబింబాన్ని మీరు కల్పించుకొని వుంటే మాత్రం ఆ చెట్టు యొక్క సర్వస్వాన్ని, మీ పక్కనే కూర్చున్న ఆ మనిషి యొక్క సమస్త సంపూర్ణత్వాన్ని మీరు చూడలేరు. అందులో సందేహం లేదు. మనోబింబం లేనప్పుడు మాత్రమే మీరు సంపూర్ణంగా చూడగలుగుతారు. ఈ మనోబింబం అంటే పరిశీలకుడు- ఒక కేంద్రం- అక్కడి నుండే మీరు పరిశీలిస్తుంటారు. ఒక కేంద్రం నుండి, అక్కడినుండి మీరు పరిశీలిస్తుంటే, పరిశీలకుడికీ, పరిశీలిస్తున్న అంశానికీ మధ్యన ఎడం వుంటుంది. నేను చెప్తున్న దానిమీద అంత విపరీతమైన శ్రద్ధ చూపనక్కరలేదు, మీ అంతట మీరే యిది పరిశీలించి తెలుసుకోవచ్చు. మీ భార్యని గురించో, మీ భర్తను గురించో, ఒక చెట్టును గురించో ఒక మనోబింబం మీరు కల్పన చేసుకొనివుంటే, ఆ మనోరూపమే దానిని చూస్తూ వున్న కేంద్రం. అప్పుడు పరిశీలకుడు, పరిశీలిస్తున్న అంశమూ విడివిడిగా వుంటాయి. ఇది అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనిని గురించి యింకా కొంత తెలుసుకుందాం.

మొట్టమొదట ఏకాగ్రతను గురించి వున్న అపభ్రమలను తొలగించుకుందాం. ధ్యానం చేసేవారు, ధ్యానం అధ్యయనం చేసే లేదా ధ్యానం బోధించే అధ్యాపకులు పదేపదే చెప్పే ప్రధమ సూక్తుల్లో యిది ఒకటి- ఏకాగ్రతను మీరు నేర్చుకోవాలి అని. అంటే, ఒక ఆలోచన మీదే కేంద్రీకరించడం, యితర ఆలోచనలను త్రోసిపారేసి, ఆ ఒకే ఒక ఆలోచన మీద మాత్రమే మనసును స్థిరంగా నిలపడం. ఇది చాలా మూర్ఖత్వం. ఎందుకంటే, అప్పుడు కొన్ని ఆలోచనలకు, మీరు నిరోధం చూపుతుంటారు. ఒక విషయం మీదే కేంద్రీకృతం చేయాలనే ఒత్తిడికీ, రకరకాలైన యితర విషయాల మీదకు పరుగు పెడుతున్న మీ మనసుకూ మధ్యలో యుద్ధం జరుగుతున్నదన్నమాట. అసలు మీరు చేయవలసినది ఆ ఒక్క ఆలోచన ఎడల సావధానత్వం కలిగి వుండటమే కాకుండా, మనసు ఎక్కడెక్కడ సంచరిస్తున్నదో దాని ఎడల, మనసులో జరిగే ప్రతి కదలిక ఎడల కూడా సంపూర్ణ సావధానత కలిగివుండటం. ఏ ఒక్క కదలికనూ నిరాకరించకుండా వున్నప్పుడే, “నా మనసు ఎక్కడెక్కడికో సంచారం పోతున్నది, నా మనసు పరధ్యానంగా వున్నది” అని మీరు అనకుండా వున్నప్పుడే, యిది సాధ్యమవు