పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

43

ఆలోచన యొక్క సమస్త స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి. ఇక, యీ ఆలోచన స్వరూపాన్ని మీరు ఎప్పుడు అవగాహన చేసుకుంటారంటే, మీరు ఒక సజీవమైన స్రవంతి, కదలిక అని అర్థంచేసుకోవడం మొదలు పెట్టినప్పుడు. అర్ధంచేసుకోకపోతే ఆలోచన్లకు మరికొంత చేర్చి పెడతారు. అప్పుడది మృతప్రాయంగా అవుతుంది. సంస్కృతి అనే చట్రంలో మీరు ఒక సజీవమైన ప్రాణి. ఆ సంస్కృతి, సంప్రదాయం, ఆ ఆధిపత్యం మిమ్మల్ని పట్టి వుంచుతాయి. ఈ చట్రం లోపల వున్న చేతనలో అస్తవ్యస్తత వుంటుంది. ఈ ప్రక్రియ సమస్తాన్ని అవగాహన చేసుకొని, అంతకంటే యింకా చాలా ముందుకు పోవడమే- యిప్పుడు మనం అదే చేయబోతున్నాం. ధ్యానం.

ధ్యానం అంటే మంత్రాలను పునశ్చరణ చేసే సూత్రం కాదు, క్రమబద్ధంగా గాలి పీల్చడం కాదు, ఒక ప్రత్యేకమైన ఆసనం వేసుకొని కూర్చుని ఎరుకగా వుండటాన్ని అభ్యాసం చేయడంకానీ, సావధానత్వాన్నీ అభ్యాసం చేయడంకాని కాదు- యివన్నీ బొత్తిగా యాంత్రికమైన పనులు. మనం మాట్లాడుకుంటున్నది ఒక సజీవమైనదానిని గురించి. శతాబ్దాల తరబడి యీ యాంత్రికమైన వాటిని మీరు అభ్యాసం చేస్తూనే వున్నారు. వీటిని ఆచరించినవారు మరణించారు; వారు చూసిన మనోబింబాలన్నీ వారి గతం నుండి, వారి నిబద్ధీకరణం నుండి వారు దృశ్యీకరించుకున్నవి. కానీ మనం మాట్లాడుకుంటున్న ధ్యానం సజీవత్వంతో తొణికిసలాడుతుంటుంది; యాంత్రికమైన, పునశ్చరణ చేయడం వంటి, క్రమ శిక్షణా బద్ధమైన ధ్యానం కాదు. ధ్యానం అంటే ఏమిటో మీకు తెలిస్తే తప్ప మరణం అంటే ఏమిటో బాగా తెలిస్తే తప్ప- ఒక నూతన సంస్కృతి వుండదు, నూతనమైనది ఏదీ జన్మించదు.

చూడండి, సంస్కృతి అంటే చాలా అద్భుతమైనది. అయితే అది నిరంతరంగా మీరు మాట్లాడుతూవుండే మృత సంస్కృతి కాదు- భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి కాదు. అది ఎప్పుడో భూస్థాపితమై పోయింది, గతించి పోయింది, సమాప్తమై పోయింది. సజీవమైన సంస్కృతి అంటే యిప్పుడు యదార్థంగా జరుగుతున్నది ఏదో అది. ఈ గందరగోళం అంతటినీ, యీ గజిబిజి నంతటినీ, యీ దారుణ దుర్భరవేదన లన్నింటినీ పరిశీలించి చూసి, అందులో నుండి ఎదగడం, అందులోనుండి వికాసం చెందడం, అదీ సంస్కృతి అంటే. పోయిన మీ పూర్వీకుల వద్దకు తిరిగివెళ్ళడం కాదు.

కాబట్టి, ధ్యానం అంటే ఏమిటి అనే యీ ప్రశ్నకు సమాధానం కోసం మనం అందరం కలిసి అన్వేషించబోతున్నాం, మనందరం కలిసి ప్రయాణించబోతున్నాం.