పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

39

వివేకం వుదయిస్తుంది. మీ రెప్పుడయినా ప్రశ్నించారా, అడిగారా, ఆలోచనకి ఆరంభం ఏమిటి అనీ, ఆలోచన ఎట్లా పుడుతున్నదీ అనీ, బాగా అర్ధం చేసుకోవలసిన చాలా ముఖ్య విషయం యిది. ఎందుకంటే ఆలోచనకు ఆరంభం ఏమిటి అన్నది అర్ధం చేసుకుంటే, అప్పుడు బహుశ మీరు, మునుపు జరిగినదానిని పునరుక్తి చేసుకోవడం అనే ఆలోచనల భారం లేని మనసును కనిపెట్టగలుగుతారు. మేము యింతకుముందు చెప్పినట్లుగా ఆలోచన ఎప్పుడూ పాతదే, ఆలోచన కొత్తది ఎప్పటికీ కాలేదు. మీ అంతట మీరు కనిపెడితే తప్ప ఇంకొకరు చెప్పినది చిలకపలుకుల్లాగా తిరిగి అనడం కాదు, ఆ యింకొకరు ఎంత గొప్పవారయినా సరే- ఆలోచనకు మొదలు ఏది, ఆకుపచ్చని చిగురాకును పైకి పంపే బీజం వంటిది ఏది అనేది మీ అంతట మీరే కనుక కనిపెట్టకపోతే నిన్న యొక్క పరిమితులనుండి దాటి ఆవలగా పోవడం మీకు సాధ్యంకాదు.

ఇక, ఆలోచన ఎట్లా ఆరంభం అవుతుందో తెలుసుకోవాలంటే, మీ గురించి మీకు అవగాహన వుండాలి. విశ్లేషణ చేయడం ద్వారా కాదు. విశ్లేషణకు సమయం పడుతుంది. ఉల్లిపాయ మీద ఒక్కొక్క పొర తీసినట్లు, విశ్లేషణ ద్వారా, అంతర్ వీక్షణ ద్వారా, పైకి లేచిన ఒక్కొక్క భావనను వెంటాడి, దాని వెనకాల వున్న కారణమేమిటో పరీక్షించి, మనల్ని అవగాహన చేసుకోవచ్చు అని అనుకుంటాం. కాని దీనంతటికీ సమయం పడుతుంది. అవగాహన చేసుకోవడానికి కాలంపైన ఆధారపడితే, కాలమే క్రమరాహిత్యాన్ని తయారు చేస్తుంది. కాబట్టి కాలం అంటే దుఃఖం. మీకు అర్థమైందా? మీలో నుంచి హింసను నెట్టివేయడానికి మీరు కాలాన్ని తీసుకుంటే, హింస నుండి విమోచనాన్ని ఒక లక్ష్యంగా ఒక ఆదర్శంగా మీరు నెలకొల్పుకుంటే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు కొంత సమయం వుండి తీరాలి; హింసకూ, హింసలేని స్థితికీ మధ్యన వున్న దూరాన్ని మీరు ప్రయాణం చేయాలి. హింసను వదిలించుకోవడానికి మీరు కొంత సమయం తీసుకుంటున్నప్పుడు, ఆ సమయంలో హింస అనే విత్తనాలు మీరు నాటుతునే వుంటారు. ఇదీ సందేహం లేని వాస్తవం. “కొండ శిఖరాన్ని చేరుకున్నాక, యిక ఆ పైన నేను ఏ ఆకాంక్ష పెట్టు కోను” అని మీలో మీరు కనుక అనుకుంటే, ఆకాంక్షపరుడిలో వుండే కర్కశత్వపు బీజాలను శిఖరాన్ని చేరుకునే యీ లోగా మీరు నాటుతున్నారన్నమాట. కాబట్టి తనని తాను అవగాహన చేసుకోవడం అన్నది కాలం మీద ఆధారపడి వుండదు; అది ఆ క్షణంలోనే జరగవలసినది. దాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం.

ప్రపంచం ప్రస్తుతం అల్లకల్లోలంగా వున్నదని మనం అంటున్నాం. యుద్ధాలు వున్నాయి, ఒకే రకమైన పనులు మళ్ళీ మళ్ళీ చేయడం, చర్చిలలో వుండే వ్యవహారాలు