పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

33

చర్చించాలి అని కూడా మేము అన్నాం. ఎందుకంటే క్రమరాహిత్యం అంటే ఏమిటి అన్నది అవగాహన చేసుకోగానే, గ్రహించగానే, కేవలం మేధాపరంగా కాదు, యదార్ధంగా క్రమరాహిత్యపు సమస్త స్వరూపాన్ని చూడగానే- అప్పుడు క్రమరాహిత్యం గురించిన ఆ సంపూర్ణమైన అవగాహనలోనుండి క్రమత జన్మిస్తుంది.

ఇది అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం; ఎందుకంటే మనలో చాలామంది చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుండటం ద్వారా క్రమతను సాధించవచ్చని అనుకుంటారు; నలభై ఏళ్ళపాటు ఒకే ఆఫీసుకి వెళ్ళగలిగితే, ఒక యింజనీరుగా గానీ, ఒక శాస్త్రవేత్త గాగానీ ఒకే పద్దతిలో పని చేస్తుంటే క్రమతను తీసుకొచ్చినట్లు అని మనం అనుకుంటాం. కానీ ప్రతిరోజూ ఒకే వరుస క్రమంలో పనులు చేయడంకాదు క్రమత అంటే. ఈ వరుస కార్యక్రమమే అస్తవ్యస్తతకు దారితీసింది. బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా అస్తవ్యస్తత వున్నది. అందులో ఏ సందేహమూ లేదు, అంతటా పరచుకున్న అల్లకల్లోలం వున్నదీ, బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా ఈ అల్లకల్లోలంలో నుంచి బయట పడే మార్గం కోసం మనిషి తడుముకుంటున్నాడు, చేతులెత్తి అర్ధిస్తున్నాడు, గొంతు చించుకొని అరుస్తున్నాడు, కొత్త నాయకులను వెతుక్కుంటున్నాడు. ఒక కొత్త నాయకుడు - రాజకీయనాయకుడు కాని, మతాధిపతి కాని దొరుకుతే అతన్ని అనుసరిస్తాడు. అంటే అర్థం, మనిషి యాంత్రికంగా అలవాటైన ఒక రోజువారీ కార్యక్రమాన్ని, ఒక ఆశయాన్నీ, ఒక పద్ధతిని అనుసరించడానికి సిద్ధంగా వుంటాడూ అని.

అయితే, యీ క్రమరాహిత్యం- అంటే అస్తవ్యస్తత ఎట్లా వచ్చింది అని కనుక పరిశీలిస్తే, ఎక్కడయితే ఆధిపత్యం, ముఖ్యంగా అంతర్గత ఆధిపత్యం వుంటుందో అక్కడ అస్తవ్యస్తత వున్నదని గ్రహిస్తాం. అంతర్గతమైన యింకొకరి ఆధిపత్యాన్ని బోధకుడిదో, గురువుదో, గ్రంధానిదో, మరొకరిదో- మనం అంగీకరిస్తాం. అంటే యింకొకరినీ. వారి నియమ సూత్రాలను, వారి బోధలను, వారి ఆజ్ఞలను, వారి ఆధిపత్యాన్ని ఒక యంత్రంలాగా అనుసరించడం ద్వారా మన లోపల క్రమతను తేగలుగుతామని ఆశపడతాం. శాంతి కావాలంటే క్షమత అవసరం. అయితే ఒక ఆధిపత్యం వెనకాల మనం పరుగులు పెట్టి, అనుసరించి సాధించిన క్రమత్వం వల్ల గందరగోళమే కలుగుతుంది. ప్రపంచంలో, ముఖ్యంగా యీ దేశంలో ఏం జరుగు తున్నదో మీరు పరిశీలించవచ్చు. ఇక్కడ యింకా ఆధిపత్యపు పరిపాలనే సాగుతున్నది. ఇక్కడ అంతర్గత ఆధిపత్యం, శాసించడం, మరొకరిని అనుసరించాలనే బలమైన కాంక్ష చాలా పటిష్టంగా వేళ్ళుతన్నుకొని వున్నాయి. ఇదంతా యిక్కడి సంప్రదాయంలోని, యిక్కడి సంస్కృతిలోని అంశం. అందువల్లనే యిక్కడ ఎన్నో చిన్నా, పెద్దా ఆశ్రమాలు