పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

27

హింస మీలో వున్నదని గ్రహించడమే మొట్టమొదట మీరు చేయవలసినది-అహింసాత్మకంగా అవాలని ప్రయత్నించడం కాదు. హింసను వున్నదాన్ని వున్నట్లుగా చూడటం, దానిని మార్చడానికి ప్రయత్నించకుండా, క్రమశిక్షణలో పెట్టకుండా, ఎదుర్కొని తట్టుకోకుండా, అణచివేయకుండా, దానిని మీరు అప్పుడే ప్రప్రధమంగా చూస్తున్నట్లుగా చూడటం- అంటే ఏ ఆలోచన లేకుండా దానిని పరికించడం.

ఒక చెట్టును అమాయకమైన స్వచ్చత్వంతో పరికించడం అంటే అర్థం ఏమిటో మునుపు వివరించి చెప్పాను. అంటే ఒక మనోబింబం అనేది లేకుండా దానివైపు చూడటం. అదే విధంగా హింసను కూడా ఒక మనోబింబం లేకుండా చూడాలి; అసలు హింస అన్న మాటల్లోనే ఆ బింబం కలిసిపోయివుంది. ఆలోచన యొక్క కదలిక లేకుండా దానివైపు చూడటం అంటే మొట్టమొదటిసారి దానివైపు చూస్తున్నట్లుగా చూడటం- కాబట్టి అమాయకత్వంతో దానివైపు చూడటం.

ఇది మీరు గ్రహిస్తున్నారని ఆశిస్తాను, ఎందుకంటే యిది అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. తన లోపల వున్న సంఘర్షణను కనుక మానవుడు పూర్తిగా తొలగించుకో గలిగితే, అన్ని విధాలా విభిన్నమైన ఒక నవ్య ప్రపంచాన్ని అతను తయారు చేయగలుగుతాడు. అప్పుడు అది సమూలంగా జరిగిన విప్లవం అవుతుంది. అందుకని, మనం అడుగుతున్నది ఏమిటంటే, మానవుడు, నిబద్ధీకరణం చెందిన యీ జీవి, తన నిబద్దీకరణం అంతటినీ బ్రద్దలు చేసుకొని బయట పడగలడా? అది జరిగితే అటు పైన అతను ఒక హిందువుగానో, ముస్లీంగానో, కమ్యునిస్టుగానో, అభిప్రాయాలతో, సిద్దాంతాలతో నిండిపోయిన సోషలిస్టుగానో వుండిపోడు. అవన్నీ సమాప్తమయి పోతాయి. విషయాలను నిజంగా ఎట్లా వున్నాయో అట్లా చూడటం మీరు ఆరంభించినప్పుడు మాత్రమే యిదీ సాధ్యమవుతుంది.

చెట్టుని చెట్టులాగే చూడాలి; చెట్టు ఎట్లా వుంటుంది అని మీరనుకుంటుంటారో దానిని కాదు. భార్యవైపో, భర్తవైపో చూస్తున్నప్పుడు అతడు కాని, ఆమెకాని నిజంగా ఎట్లా కన్పిస్తున్నారో దానినే చూడాలి తప్ప, ఆ వ్యక్తి గురించి మీరు తయారు చేసుకున్న కాల్పనిక స్వరూపం ద్వారో కాదు. అప్పుడే వాస్తవాన్ని మాత్రమే, 'వున్నది' ని మాత్రమే మీరు చూడగలుగుతారు. అంతే తప్ప, మీ వ్యక్తిగతమైన అభిలాషలతోనూ, అభిరుచులను బట్టీ, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వ్యాఖ్యానించుకోవడానికి ప్రయత్నించరు. పరిస్థితులు మనల్ని అదుపు చేస్తూ వుంటాయి. మన అభిలాష, మన అభిరుచి మనల్ని నడిపిస్తూ వుంటుంది. అందువల్లనే 'యదార్థంగా వున్నది' ని చూడనే చూడం, యదార్ధంగా వున్నది' ని చూడటమే అమాయకమైన స్వచ్ఛత్వం. అప్పుడే మనను ఒక బ్రహ్మాండమైన మార్పును పొందుతుంది.