పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

కృష్ణమూర్తి తత్వం

పని. అందువల్ల యింతకు మునుపు తెలిసిన దానినే మీరు అన్వేషిస్తున్నారు. కాబట్టి మీరు నిజంగా అన్వేషణ చేయడమే లేదు. ఇది మీరు అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల అన్వేషించడం సమస్తం ఆగిపోపోలి. అంటే, నిజంగా అర్ధం ఏమిటంటే 'ఉన్నది' ని మీరు వాస్తవంగా చూసితీరాలి. అంటే మీరు కోపంగానో, అసూయతోనో, పోటీ పడుతూనో, దురాశతోనో, స్వార్ధపూరితంగానో, పశువులాగానో, దౌర్జన్యంతోనో, హింసాత్మకంగానో వున్నారని మీరు గ్రహించినప్పుడు, ఒక ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని యిదంతా చూడటం కాదు, 'ఉన్నది' ని మీరు నిజంగా వున్నది వున్నట్లుగా చూసినప్పుడు, అప్పుడు మీరు సంఘర్షణను పూర్తిగా తొలగించివేస్తారు. సంఘర్షణతో వున్న మనసు, ఆ సంఘర్షణ ఏ రకమయినదయినా సరే, ఏ స్థాయిలోనైనా సరే వున్న మనసు మందకొడిగా తయారవుతుంది. అస్తమానం పోట్లాడుకుంటున్న యిద్దరు వ్యక్తుల లాగా- వాళ్ళు జడంగా, మూర్ఖంగా వుండి, సున్నితత్వాన్ని కోల్పోయి, మొద్దుబారిపోతారు. సంఘర్షణ ఎటువంటిదయినా సరే మనసును మందకొడిగా తయారు చేస్తుంది. అయితే, 'ఉన్నది'ని, దానికి విరుద్ధమైన దానిని తేకుండా, వాస్తవంగానే మీరు చూసినప్పుడు, సంఘర్షణ బొత్తిగా వుండదు.

ఇంకా వివరంగా చెప్తాను. జంతువుల్లో హింసాత్మకత వుంటుంది. జంతువుల నుండి పరిణామం చెందిన మానవుల్లో కూడా హింస వుంటుంది; హింసాత్మకంగా వుండటం, కోపం తెచ్చుకోవడం, యీర్ష్యపడటం, అసూయ చెందడం, అధికారం కోసం, హోదా కోసం, ప్రతిష్ఠకోసం పాకులాడటం, యితర్లమీద పెత్తనం చలాయించడం, దౌర్జన్యం ప్రదర్శించడం యివన్నీ మనిషి అస్తిత్వంలో వున్నాయి. మనిషిలో హింస వున్నది- వేల సంఖ్యలో జరిగిన యుద్ధాలవల్ల యిదీ తెలుస్తూనే వుంది. కాని మనిషి ఒక ఆదర్శవాదాన్ని తయారుచేసి దానికి 'అహింస' అని పేరు పెట్టాడు. దయచేసి శ్రద్దగా వినండి. ఈ దేశం, యీ భారత దేశం, నిరంతరంగా దానిని గురించే అంతులేకుండా మాట్లాడుతూ వుంటుంది. అదంతా వట్టి వూహలపోగు అయిన ఆదర్శవాదం ఆనబడే చెత్త. నిజంగా హింస జరిగినప్పుడు, అంటే యీ దేశానికీ, పక్కనే వున్న మరో దేశానికీ మధ్య యుద్ధం జరిగినప్పుడు, అందరూ హాయిగా ఆ యుద్ధంలో పాల్గొన్నారు; ఎంతో యిష్టంగా. సరే, వాస్తవంలో హింసాత్మకంగా వుండి, అహింస అనే ఆదర్శం మీకు వుంటే సంఘర్షణ బయలు దేరుతుంది. అహింసాత్మకంగా అపాలని మీరు సదా ప్రయత్నిస్తూ వుంటారు- సగం సంఘర్షణ అందువల్లే. హింసాత్మకంగా వుండకుండా మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకుంటారు- ఇందులో మళ్ళీ సంఘర్షణ వుంటుంది, ఒత్తిడి వుంటుంది. కాబట్టి, మీలో హింస వుండి, అహింస అనే ఆదర్శాన్ని అవలంబిస్తే, మొత్తం మీద మీరు హింసాత్మకంగా వున్నట్లే.