పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రసంగాలు
17
 

సంప్రదాయాలతో, ఎన్నో అంధాచారాలతో, ఎన్నో భయాలతో కూడుకొనివున్న, మతము, సాంఘిక విభజనలు, భాషా భేదాలు వున్న యీ భారతీయ సంస్కృతికి పుట్టిన ఫలితమే కాబట్టి. ఈ సమస్తంలో మీరూ ఒక భాగం. అదీ మీరంటే. దాని నుంచి మీరు విడిగా లేరు. నేను ఏమిటి అనే స్పృహ కలిగి, మీ సంపూర్ణ సావధానతను దానికి యిచ్చిన తక్షణమే, ఆ క్షణంలోనే అదంతా మీ నుండి రాలిపడిపోతుందని గ్రహిస్తారు. అప్పుడు గతం అనే దానినుండి పూర్తిగా విముక్తులవుతారు. మీ నిబద్దీకరణం గురించిన ఎరుక కలిగివున్నప్పుడు దానంతట అదే రాలిపోతుంది. స్వయం సంకల్పం వల్ల కాదు, అభ్యాసం వల్ల కాదు; ఒక ప్రతిచర్య లాగానూ కాదు; కేవలం మీరు సావధానతతో వుండటం వలన నిబద్ధీకరణ నుండి స్వేచ్ఛ కలుగుతుంది.

అయితే మనలో చాలామంది పరాకుగానే జీవితాన్ని దాటవేస్తుంటారు. చాలా అరుదుగా మనం సావధానతతో వుంటాం. ఒక హిందువుగానో, ఒక బౌద్ధుడిగానో, కమ్యునిస్టుగానో, సోషలిస్టుగానో మరోవిధంగానో మన నిబద్దీకరణను బట్టి సాధారణంగా మనం ప్రతిస్పందిస్తూ వుంటాం. అంటే మనం పెరిగిన వాతావరణాన్ని అనుసరించి మన సమాధానాలు వస్తూ వుంటాయి. కాబట్టి ఆ విధమైన ప్రతిస్పందనలు మళ్ళీ కొంత దాస్యత్వాన్ని, యింకా కొంత నిబద్ధీకరణను కలిగిస్తాయి. మీ నిబద్ధీకరణం గురించి మీకు ఎరుక కలిగినట్లయితే ఆ స్పృహ కనుక కలిగి. కాస్త సావధానత కనుక చూపిస్తే- అప్పుడిక మీ మనసు చేతన, అంతఃచేతనగా విభజింపబడిలేదని గ్రహిస్తారు; అప్పుడు మీ మనసు తుదీమొదలూ లేకుండా వాగుతూవుండటం అనేది ఆపినట్లుగా గ్రహిస్తారు. అందువల్ల మీ మనస్సు అత్యంతమైన సున్నితత్వాన్ని పొందుతుంది. చాలా సున్నితంగా వుండే మనస్సు మాత్రమే నిశ్శబ్దంగా వుండ గలుగుతుంది- కర్కశంగా తయారయిన మనస్సు కాదు; క్రమశిక్షణతో, కట్టుబాట్లతో, సర్దుకొని పోవడం ద్వారా, లొంగిపోయి వుండటం ద్వారా చిత్రహింసలకు లోనయిన మనస్సూ కాదు. ఇటువంటి మనస్సు ధ్యానం అనే పేరు పెట్టి మంత్రాలు వల్లె వేయడం ద్వారా ఏనాటికీ నెమ్మదిని పొందలేదు. ధ్యానం అనేది చాలా భిన్నమైనది; అది పూర్తిగా మరొకటి- ఆ విషయాన్ని గురించి వీలవుతే మనం మరొకసారి మాట్లాడుకుందాం.

మేము చెప్పినట్టుగా, భయపడుతున్న మనసుకు, అది ఎంత ప్రయాసపడినా సరే, ప్రేమ అనేది ఏ మాత్రం తెలియదు; ప్రేమ లేకుండా ఒక నూతన ప్రపంచాన్ని మీరు నిర్మించలేరు. ప్రేమ లేకుండా ఒయాసిస్సూ వుండదు. మీరే, మనుష్యులమని అనుకుంటున్న మీరే నిర్మించిన యీ సామాజిక చట్రంలో మీరు చిక్కుకొని పోయారు. దీనిలో నుంచి బయట పడాలంటే- దీనిలోనుంచి పూర్తిగా బయటపడి తీరాలి.