10
కృష్ణమూర్తి తత్వం
సరే, భయం అనేది ఎట్లా వునికిలోకి వస్తున్నది? ఏదో ఒక దానిని గురించి మీరు భయపడుతుంటారు. చావు అంటే భయం, భార్య అంటేనో భర్త అంటేనో భయం, వుద్యోగం పోతుందేమోనని భయం. ఇంకా ఎన్నో యిటువంటి భయాలు. ఇప్పుడు మీ భయాల్లో ఏదో ఒకదాన్ని తీసుకోండి. ఆ భయాన్ని స్పృహలోకి తెచ్చుకోండి; అది ఎట్లా వునికిలోకి వస్తున్నది, దానిని గురించి మనం ఏం చేయగలం, దానిని సంపూర్ణంగా పరిష్కరించడం ఎట్లా అనేవి పరిశీలించడం మొదలు పెడదాం. మీకూ యీ వక్తకూ మధ్య అప్పుడు ఒక సత్సంబంధాన్ని స్థాపించగలుగుతాం. ఇది సామూహిక మనస్తత్వ పరిశీలన కాదు. సమూహం మొత్తం కలసి చేసే స్వీయ మానసిక విశ్లేషణా కాదు. మనందరమూ కలసి ఎదుర్కోవలసిన కొన్ని వాస్తవాల లోనికి చేసే ఒక అన్వేషణ యిది. భయం అన్నది- రేపటి రోజు అంటే భయం, వుద్యోగం పోతుందనే భయం, మరణం అంటే భయం, జబ్బు చేస్తుందనే భయం, నొప్పి అంటే భయం. ఎట్లా కలుగుతున్నది? భయం అనగానే అందులో భవిష్యత్తునీ గురించి కానీ గతాన్ని గురించి కాని ఒక ఆలోచనా ప్రక్రియ వుంటుంది. నాకు మర్నాటిని గురించి భయం, ఏమి అవబోతుందో అన్నదానిని గురించీ భయం; నాకు చావు అంటే భయం; అది యింకా చాలా దూరంలో వుంది, అయినా నాకు భయమే. సరే, భయాన్ని కలిగించేది ఏది? భయం ఎప్పుడూ మరొకదాని కారణంగా వునికిలోకి వస్తుంది. ఆ మరొక దానితో సంబంధం లేకుండా భయమే వుండదు. కాబట్టి మనకు రేపు అంటే భయం, లేదూ జరిగిపోయినది అంటేనో, జరగబోయేది అంటేనే భయం. ఈ భయాన్నీ తీసుకొచ్చింది ఏది? అది ఆలోచన కాదూ! రేపు నా వుద్యోగం పోవచ్చేమోనని నేను ఆలోచిస్తుంటాను; అందువల్ల నేను భయపడతాను. నేను చనిపోవచ్చు, చనిపోవడం సోకు యిష్టం లేదు. నా జీవితకాలమంతా నికృష్టమైన, ఘోరమైన, వికృతమైన, క్రూరమైన బ్రతుకును, ఏ భావస్పందనలూ లేకుండా మొద్దుబారి పోయిన బ్రతుకునే గడిపాను, అయినా సరే, నేను చావడానికి యిష్టపడను; భవిష్యత్తు అంటే మరణం అని నా ఆలోచన చిత్రిస్తుంది; నేనేమో దానిని చూసి భయపడతాను.
ఇదంతా మీరు అర్థం చేసుకుంటున్నారా? దయచేసి మాటలను మాత్రమే అంగీకరించి వూరుకోకండి. వట్టి మాటల శబ్దాన్ని మాత్రమే ఆలకించకండి. ఇది మీ సమస్య కాబట్టి మీరు వినండి. ఇది మీ దైనందిన సమస్య, మీరు నిద్రపోతున్నా, మేలుకొని వున్నా వుండేది- ఈ భయం అనే విషయం. ఇదీ మీరే పరిష్కరించుకోవాలి. మరొకరెవరో వచ్చి పరిష్కరించి పెట్టరు. మంత్రాలు కాని, ధ్యానం కాని, దేవుడు కాని, మత గురువు కానీ, ప్రభుత్వం కాని, మానసిక విశ్లేషకుడు గాని- ఎవ్వరూ దీనిని మీ కోసం పరిష్కరించిపెట్ట బోవడం లేదు. కాబట్టి దీనిని మీరే అవగాహన చేసుకోవాలి,