పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

9

సంస్కృతి చేసిన నిబద్ధీకరణాన్ని దాటుకొని మనసు ఆవలగా పోగలదా? పూర్తిగా విభిన్నమైన ఆయత ప్రమాణానికి చెందిన మరొక దానిని తెలుసుకోవాలంటే, అది దర్శించుకోవాలంటే- భయభీతి నుండి విముక్తి చెంది తీరాలి.

స్వీయరక్షణ కోసం జరిగే ప్రతిస్పందన భయపడటం కాదని నిస్సందేహంగా తెలుస్తున్నది కదా. ఆహారం, దుస్తులు, నివాసం మనకి అవసరం- మనందరికీ; ఒక్క సంపన్నులకే కాదు, ఒక్క గొప్పవారికే కాదు. ప్రతి ఒక్కరికీ అవసరమే, దీనికి రాజకీయ వేత్తలు పరిష్కారం చూపలేరు. రాజకీయవేత్తలు ప్రపంచాన్ని ఇండియా మొదలైన దేశాలుగా విభజించారు; ఒక్కొక్క దేశాన్ని ప్రత్యేకంగా ఒక స్వతంత్ర ప్రభుత్వం నడిపిస్తుంది; ఒక ప్రత్యేకమైన సైన్యం వుంటుంది; పైగా జాతీయత గురించిన విషపూరితమైన కట్టుకధలుంటాయి. అసలు రాజకీయ సమస్య ఒకే ఒక్కటి వుంది. అదేమిటంటే - మానవజాతినంతా ఐక్యం చేయడం. మీరు కనుక మీ జాతీయ భావాలను, దక్షిణాది, వుత్తరాది, తెలుగువారు, తమిళులు, గుజరాతీలు యింకా అవి యివీ అనే అల్పమైన విభేదాలను పట్టుకొని వేలాడుతుంటే మాత్రం అది జరిగే అవకాశం లేదు- జాతీయవాదం వట్టి మూర్ఖత్వం. సర్! ఇల్లు మంటల్లో కాలిపోతుంటే, ఆర్పడానికి నీళ్ళు తెస్తున్న మనిషిని గురించి మీరు చర్చించరు; యింటికి నిప్పు పెట్టిన మనిషి జుట్టు రంగు ఏమిటి అని ఆలోచించరు. నీళ్ళు మోసుకొని వస్తారు, అంతే. మతాలు మనుష్యుల్ని విభజించినట్లుగానే జాతీయ భావాలు మనిషి నుండి మనిషిని విడదీశాయి; ఈ జాతీయ తత్వం, మతసంబంధమైన విశ్వాసాలు మానవజాతిని విడదీశాయి; ఒక మనిషికి ప్రతికూలంగా మరో మనిషిని నిలబెట్టాయి. ఇదంతా ఎందుకు జరిగిందో మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మన స్వంతదైన ఒక చిన్న మురికిగుంటలో నివసించడమే మనందరికీ యిష్టం కనుక.

కాబట్టి మనిషి భయాన్ని తొలగించుకోవాలి. అయితే అది చేయడం చాలా కష్టసాధ్యమైన సంగతి. మనలో చాలా మందికి మనం భయపడుతున్నామనే ఎరుక వుండదు, దేనిని గురించి భయపడుతున్నామనేది కూడా మనకు తెలియదు. దేనిని గురించి భయపడుతున్నామనేది ఒకవేళ తెలిసినా యిక ఆ తరువాత ఏం చేయాలన్నది తెలియదు. అందుకని దాని నుండి పారిపోతాం. సర్! మీకు అర్ధం అవుతున్నదో? నిజంగా మనం ఏమిటో దానినుండి తప్పించుకొని పారిపోతూవుంటాం, అదే భయం. దేని వద్దకైతే మనం పారిపోతామో అదీ మన భయాన్ని యింకా ఎక్కువ చేస్తుంది. దురదృష్టవశాత్తు వలలాగా అల్లుకు పోయిన రకరకాల పలాయన మార్గాలను మనం తయారుచేసి పెట్టుకున్నాం. కాబట్టి మనకి వున్న భయాలను గురించే కాకుండా, పారిపోవడం కోసం తయారు చేసి పెట్టుకున్న వల అల్లికల వంటి వ్యూహం గురించి కూడా మనం ఎరుక కలిగివుండాలి.