పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

కృష్ణమూర్తి తత్వం

తయారుచేస్తుంది. భయంలో నుండే హింస బయలు దేరుతుంది, భయంలో నుండే మనకు బొత్తిగా ఏమీ తెలియని ఒక దానిని పూజించడం కూడా ఆరంభమవుతుంది. అందుకని మీరు సిద్దాంతాలను, కాల్పనిక రూపాలను- యీ కాల్పనిక రూపాలు చేతితో తయారైనవి కావచ్చు, మనసుతో తయారు చేసినవి కావచ్చు- యింకా రకరకాల తాత్విక భావాలనూ కొత్తగా తయారు చేసుకుంటారు. మీలో చాతుర్యం ఎక్కువైన కొద్దీ మీ కంఠ స్వరంలో, మీ హస్తవిన్యాసంలో ఆధిపత్యభావం ఎక్కువవుతూ వుంటుంది. మూర్ఖులు మిమ్మల్ని అనుసరించడం కూడా ఎక్కువవుతూ వుంటుంది. కాబట్టి చాలా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే భయభీతి నుండి సంపూర్ణమైన విముక్తి పొందడం సాధ్యమేనా అన్నది. దయచేసి మీకు మీరే యీ ప్రశ్న వేసుకోండి, తెలుసుకోండి.

ఈ నాలుగు ప్రసంగాలలో మనం చేయబోతున్నది ఏమిటంటే, ఎడారివంటిదైన, అస్తవ్యస్తంలో వున్న, హింసతో నిండివున్న యీ ప్రపంచంలో నివసిస్తున్న మనిషిలో అతను చేపట్టవలసిన చర్యను మేలు కొల్పడం. అప్పుడే మనలో ప్రతి ఒక్కరం ఒక ఒయాసిస్సుగా మారుతాం. అది ఏమిటో కనుక్కోవాలంటే, ఆ స్పష్టతను, ఆ నిర్దుష్టతను అటుపైన తీసుకొని రావాలంటే, మనసు ఆలోచనలన్నింటినీ అధిగమించి ఆవలగా పోగలగాలంటే, ప్రప్రధమంగా భయాలన్నింటి నుండి విముక్తి పొంది తీరాలి.

మొట్ట మొదటగా భౌతికమైన భయం వున్నది. ఇది జంతు జాతికి స్వభావ సిద్ధమైన ప్రతి స్పందించే గుణం, మనలో వున్నది చాలా వరకు జంతువుల నుండి వారసత్వంగా లభించినదే కాబట్టి మన మెదడు నిర్మాణంలోని చాలా ఎక్కువ భాగం జంతువుల నుండి సంక్రమించినదే. ఇది వైజ్ఞానిక సత్యం. ఇది ఒక సిద్ధాంతం కాదు. ఇది ఒక వాస్తవం. జంతువులలో హింసాత్మకత వుంటుంది. మనుష్యులలోను వుంది. జంతువులకి అత్యాశ ఎక్కువ. వాటికి మెప్పుదల యిష్టం. ముద్దు చేయించు కోవడం మరీ యిష్టం, సుఖంగా వుండటం కోసం ఆరాటపడతాయి. మనుష్యుల్లో కూడా యిదే కనబడుతుంది. జంతువుల్లో తమ స్వంతం చేసుకోవాలనే గుణం, పోటీ తత్వం వున్నాయి. మనుష్యుల్లోనూ అంతే. జంతువులు గుంపులుగా జీవిస్తాయి. మనుష్యులు గూడా ఒక బృందంగా ఏర్పడి పనిచేయాలనుకుంటారు. జంతువుల్లో ఒక సాంఘిక వ్యవస్థవుంది. మనుష్యుల్లోనూ వున్నది. ఇంకా ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చును. అయితే జంతువులనుండి సంక్రమించినవి మనలో చాలా వున్నాయని గ్రహించడానికి యివి చాలు.

ఈ జంతు లక్షణాల నుండి మనల్ని విముక్తి చేసుకోవడమే కాకుండా, యింకా ఆవలగా దీనిని మించి పోయి కనిపెట్టడం- కేవలం మాటల్లో శోధించడం కాదు, నిజంగా తెలుసుకోవడం- మనకు సాధ్యమేనా? సమాజం చేసిన, తాను పుట్టి పెరిగిన