ప్రసంగాలు
7
కాబట్టి, సమస్తమైన ఆధిపత్యాన్ని త్రోసి వేయగలిగితే, అప్పుడు తరచి చూడటం, అన్వేషించడం ఆరంభించగలుగుతాం. ఈ అన్వేషణ చేయాలంటే మీకు శక్తి వుండాలి, ఒక్క శరీర సంబంధమైన శక్తే కాదు, మానసిక శక్తి కూడా, మెదడు చురుకుగా పనిచేస్తుండాలి; చేసినదే మళ్ళీ మళ్ళీ చేస్తూ వుండటం వల్ల మందకొడిగా తయారై వుండకూడదు. ఘర్షణ వున్నప్పుడే శక్తి వృధా అవుతూవుంటుంది. దయచేసి కాస్త యిది గమనించండి. కేవలం ఈ వక్త చెప్పాడు కాబట్టి అంగీకరిస్తే, అప్పుడందులో అర్థమే వుండదు. మనకి కావలసినది స్వేచ్చ, ఏదో ఒక రకమైన స్వేచ్ఛకాదు, మానవుడి సంపూర్ణ విముక్తి. కాబట్టి మనకి శక్తి కావాలి. మనలో మనస్తత్వ పరమైన, ఆధ్యాత్మికమైన ఒక గొప్ప విప్లవాన్ని కలిగించడానికే కాకుండా, తరచి శోధించడానికి, పరికించడానికి, క్రియ చేయడానికి కూడా. సంబంధ బాంధవ్యాల్లో ఘర్షణ అనేది వున్నంతవరకు, భార్యా భర్తల మధ్య కానీ, ఒక కులానికీ మరోకులానికీ, ఒక దేశానికీ మరో దేశానికీ మధ్య కానీ, బాహ్యంగా కానీ, అంతర్గతంగా కానీ- ఏ రూపంలోనైనా సరే, ఎంత సూక్ష్మరూపంలోనైనా సరే, సంఘర్షణ వున్నంతకాలం శక్తి వృథా అవడం జరుగుతుంది. స్వేచ్ఛ వున్నప్పుడు శక్తి శిఖరాగ్రస్థాయిలో వుంటుంది.
ఇప్పుడు, యీ ఘర్షణ నుంచి, యీ సంఘర్షణ నుంచి విముక్తి పొందడం ఎట్లా అనేది మనమే శోధించి, అన్వేషించి తెలుసుకుందాం. మీరూ నేనూ కలిసి అన్వేషిస్తూ, శోధిస్తూ, ప్రశ్నిస్తూ యీ ప్రయాణం చేయబోతున్నాం. అనుసరిస్తూ మాత్రం కాదు. తరచి శోధించాలంటే స్వేచ్ఛ వుండితీరాలి. భయం వున్నప్పుడు స్వేచ్చ వుండదు. భయం అనే భారాన్ని, బాహ్యంగానే కాదు, అంతర్గతంగా కూడా మనం మోస్తూ వుంటాం. ఉద్యోగం పోతుందేమో, తినడానికి తగినంత ఆహారం వుండదేమో, యిప్పుడు మనం వున్న స్థితిలో నుండి కిందకు పడిపోతామేమో, మన పై అధికారి అసహ్యంగా ప్రవర్తిస్తాడేమో అనేది బాహ్యంగా వుండే భయాలు, అంతర్గతంగా కూడా ఎన్నో భయాలు వుంటాయి. జీవితంలో మనం ఏమీ సాధించలేదు అనో, విజయం సాధించగలమా అనో భయం; చనిపోవడం అంటే భయం, ఒంటరితనపు భయం; ఇతరుల ప్రేమను పొందలేనేమో అనే భయం, బొత్తిగా తోచకపోవడం అనే భయం, యింకా యిటు వంటివి. కాబట్టి యీ భయం అనేది ఒకటి వున్నది; సమస్యలన్నింటినీ తరచి శోధించి, పోటి నుండి విముక్తి పొందకుండా యీ భయమే నిరోధిస్తున్నది. ఈ భయమే మన లోపలకు లోతుగా తరచి చూసుకోకుండా మనల్ని నిరోధిస్తున్నది.
కాబట్టి మొట్టమొదటి సమస్య, నిజంగా చాలా ప్రధానమైన మన సమస్య ఏమిటంటే భయ భీతినుండి విముక్తి చెందడం. భయం ఏం చేస్తుందో మీకు తెలుసునా? అది మనసును చీకటితో నింపుతుంది. మనసును మందకొడిగా