6
కృష్ణమూర్తి తత్వం
దురవస్థలకు, క్రూరత్వానికి, యీ హింసకు కారణమైన వాటినన్నింటినీ త్రోసిపుచ్చి నపుడు- అప్పుడు వాస్తవాలు, నిజంగా ‘ఉన్నది' ఏమిటి అన్నవీ బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా మన ఎదురుగా నిలబడతాయి. 'ఉండవలసినది' ఏమిటి అన్నది కాదు; 'ఉండవలసినది' అన్నదానికి అర్ధం లేదు.
మీకు తెలుసు, విప్లవాలను, ఫ్రెంచి విప్లవం, రష్యన్ విప్లవం, కమ్యునిస్టు విప్లవాలను 'ఉండవలసినది' ఏమిటి అన్న సిద్దాంతం మీద నిర్మించారు. లక్షలాది ప్రజలను హతమార్చాక, సిద్దాంతాలంటే ప్రజలకి విసుగుపుట్టిందని వాళ్ళు కని పెడుతున్నారు. కాబట్టి యికపై మీకు సిద్ధాంతవాదులు వుండరు, యికపై మీకు నాయకులు వుండరు; ఇక మీదట మీరు ఏమి చేయాలో చెప్పడానికి ఎవరూ వుండరు. ఇప్పుడు ప్రపంచాన్ని మీకు మీరుగా ఎదుర్కోవాలి, ఒంటరిగా; నిష్క్రియగా కూర్చోడానికి వీల్లేదు. కాబట్టి మన సమస్య బ్రహ్మాండంగా పెరిగిపోయిందీ, భయంకరంగా తయారయింది. మీరు ఒక మనిషిగా, ఒంటరిగా, మరొకరి నుండి మద్దతు లేకుండా, సమస్యలను గురించి సుస్పష్టంగా ఆలోచించుకోవాలి. ఏ గజిబిజి చిక్కులలో పడకుండా క్రియ ఆచరించాలి. అప్పుడే సిద్దాంతాల ఎడారిలో మీరు ఒక ఒయాసిస్ గా అవుతారు. ఒయాసిస్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఇసుక, అస్తవ్యస్తత తప్ప మరేమీ లేని మహా విస్తృతమైన ఎడారిలో కొద్దిగా చెట్లూ, నీరు, ఒక చిన్న పచ్చికబయలు వున్న స్థలం యిది. మనలో ప్రతి ఒక్కరం ప్రస్తుతం అట్లాగే అయిపోవాలి. మనం వున్న చోటు ఒక ఒయాసిస్ గా మారాలి. అప్పుడే మనలో ప్రతి ఒక్కరం నిర్దుష్టతతో వుండి, అయోమయంలో పడకుండా. వ్యక్తిగతమైన అభిరుచి ననుసరించకుండా, మన స్వాభావికమైన వుద్వేగాలనో, పరిస్థితుల ప్రాబల్యాన్నో అనుసరించకుండా, స్వేచ్ఛగా వర్తించ కలుగుతాం.
కాబట్టి యీ సమస్య చాలా పెద్దది,దాని నుంచి దూరంగా పారిపోవడం ద్వారా మీరు సమాధానం యివ్వలేరు. అది మీ గుమ్మం ఎదుటే వున్నది. కాబట్టి పరిస్థితిని మీరు గ్రహించి తీరాలి. మీ చుట్టూరా ఒకసారి చూసుకోవాలి. మీరు ఏం చేయాలి అనేదీ మీరే తెలుసుకొని తీరాలి. ఇప్పుడు మనం అంతా కలిసి చేయబోయేది అదే. మీరు ఏం చేయాలి అనేది యీ వక్త చెప్పబోవడం లేదు. ఎందుకంటే అతనికి ఏ ఆధిపత్యమూ లేదు. ఇది మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మికమైన ఆధిపత్యాలు అన్నీ ముగిసి పోయాయి. ఎందుకంటే అవి గందరగోళానికీ, అంతులేని క్షోభకూ, సంఘర్షణకు దారితీశాయి. పరమాతి పరమ మూర్ఖులు మాత్రమే వాటిని అనుసరిస్తారు.