పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

కృష్ణమూర్తి తత్వం


మనం ఏం చేయాలో మనకే తెలిదు, ఒక పుస్తకంలోనుంచి మరో పుస్తకంలోకి, ఒక వేదాంతం నుంచి మరో తత్వానికీ, ఒక గురువు దగ్గర నుంచి మరో గురువు వద్దకు అంతం అనేది లేకుండా వెతుక్కుంటూ పోతూవుంటాం. నిజానికి మనం వెతుకుతున్నది నిర్దుష్టంగా చూడగలగడం కోసం కాదు. అసలు మనసు స్థితి ఏమిటీ అనేది అవగాహన చేసుకోవడానికి కాదు. మన నుంచి మనము తప్పించుకొని పారిపోవడానికి మార్గాలకోసం, పద్ధతుల కోసం వెతుక్కుంటూ వుంటాం. ప్రపంచ మంతటా పున్న భిన్న భిన్న మతాలు తప్పించుకొని పారిపోవడం ఎట్లా అనేదే చూపాయి. సుఖాన్నీ, తృప్తినీ యిచ్చే ఒక ఆశ్రయాన్ని కనిపెట్టే ప్రయత్నమే మనకు సంతోషాన్ని కలిగిస్తూ వుంటుంది. ఇదంతా పరికించి చూసినప్పుడు- పెరిగిపోతున్న జనాభా, మనుష్యులలో వుండే అతి ఘోరమైన నిర్దాక్షిణ్యత, యితరుల మనోభావాలను, ఎదుటి వారి జీవితాలను బొత్తిగా లెక్కచేయని నిర్లక్ష్యభావం, సామాజిక నిర్మాణం పున్న తీరుని ఏమాత్రం పట్టించుకోక పోవడమూ చూసినప్పుడు, యిటువంటి అల్లకల్లోలంలోనుండి ఒక క్రమతను తీసుకొని రావడం సాధ్యమేనా అని అనిపిస్తుంది. రాజకీయపరమైన క్రమ వ్యవస్థ కాదు- రాజకీయాలు క్రమతను ఏనాటికీ స్థాపించలేవు. ఒక ఆర్థిక విధానం కానీ, మరో రకమైన సిద్ధాంతం కానీ యీ క్రమతను సాధించలేవు. అయితే మనకీ క్రమత అనేది చాలా అవసరం. ఎందుకంటే బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా చాలా చాలా అస్తవ్యస్త పరిస్థితి వున్నది. దీనిని గురించి మనకి అస్పష్టంగా, ఒక వూహగా కొద్దిగా తెలుసు. సమస్యలు చాలా భయంకరమైనవనీ మనం అనుకుంటాం. జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. అందుకని, “నేను యీ అల్లకల్లోలపు ఘోరావస్థలో, హింసలో, అవివేకంలో జీవిస్తున్న మనిషిని. నేను ఏం చేయగలుగుతాను?” అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. నిజమైన ఆసక్తి మీలో ఏ మాత్రం వున్నా మీకు మీరే యీ ప్రశ్న తప్పక వేసుకొని వుంటారు. “నేను ఒక్కడినీ చేయగలిగింది ఏమిటి” అని నన్ను నేను కనుక గట్టిగా ప్రశ్నించుకుంటే, “ఈ సమాజ వ్యవస్థను అంతర్గతంగానే కాదు, బాహ్యంగా కూడా మార్చడానికి గానీ, లేదా సక్రమస్థితిని నెలకొల్పడానికి గానీ నేను చేయగలిగింది ఏమీ లేదు” అనే సమాధానం రావడం తధ్యం.

సాధారణంగా “నేను చేయగలిగింది ఏమిటి” అనే ప్రశ్నను మనం వేసుకుంటాం, దానికి “ఏమీ చేయలేను” అనే సమాధానమే ఎప్పుడూ వస్తూ వుంటుంది. ఇక ఇక్కడ ఆగిపోతాం. అయితే యీ సమస్యకు మరింత లోతయిన సమాధానం రావలసిన ఆవశ్యకత వుంది. ఈ సమస్య ఎంత ముఖ్యమైనదంటే దీనికి మనలో ప్రతి ఒక్కరూ ఒక సంపూర్ణ మానవునిగా ప్రతిస్పందించాలే తప్ప ఒక హిందువుగానో, ఒక బౌద్దుడిగానో,