Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భయం ఆలోచనల్లో పుట్టి పెరుగుతుంది

ప్రతి విషయంలోనూ ఒక గంభీరమైన దృష్టి వుండటం చాలా మంచిదని నాకనిపిస్తుంది. బరువైన విషయాలు మాట్లాడాలనీ మనం కూర్చున్నప్పుడు అది మరీ ముఖ్యం. సావధానతతో వుండగలగడం, నిశితంగా చొచ్చుకొనిపోయి చూడగల గుణం, మనలో ప్రతి ఒక్కరికీ వున్న రకరకాల సమస్యలలోకి, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల లోనికి లోతుగా విచారణ జరపడం - తప్పకుండా వుండి తీరాలి. పరిశీలించి చూస్తే, యీ దేశంలోనే కాదు, ప్రపంచమంతటా అల్లకల్లోలం వున్నది, విపరీతమైన అస్తవ్యస్త పరిస్థితి వున్నది; ఏ మాత్రం తగ్గుముఖం పట్టని అనేక బాధలను మనిషి యింకా ఎదుర్కుంటునే వున్నాడు. పాశ్చాత్యదేశాలలో గొప్ప సిరిసంపదలు వున్నా అక్కడ అనేక సమస్యలు కూడా వున్నాయి; ఒక ఆర్థిక, సామాజిక రంగాలలోనే కాదు, యింకా అంతకంటే లోలోపలి విషయాల్లో కూడా. అక్కడి యువతీ యువకులు తిరుగుబాటు చేస్తున్నారు. సంప్రదాయాలకు, సమాజపు ఆధిపత్యానికి, ఆ పద్ధతులకు వాళ్ళు తల వొంచడం లేదు.

ఈ దేశానికి వచ్చినప్పుడు- నేను ప్రతి సంవత్సరం యిక్కడికి వస్తుంటాను-అతి వేగంగా దిగజారిపోతున్న స్థితిగతులు, పేదరికం, మనుష్యులంటే ఏమాత్రం కనికరం లేకపోవడం, రాజకీయాలలోని వంచనా శిల్పం, పూర్తిగా అంతర్థానమై పోతున్న ప్రగాఢ ఆధ్యాత్మిక విచారణ, విభిన్న వర్గాల మధ్య ఆటవిక స్థాయిలో కలహాలు, ఏదో ఒక స్వల్ప విషయానికి నిరాహారదీక్షలు పూనడం - యివన్నీ నాకు కనబడుతూ వుంటాయి. మంటల్లో యిల్లు తగలబడి పోతున్నప్పుడు, యింతటి అల్లకల్లోలం వున్నప్పుడు, యింతటి ఘోరమైన స్థితిలో వున్నప్పుడు అలా అల్పమైన విషయాల కోసం జీవితం అంతా గడిపివేయడం, వాటికోసం హంగామా చేయడం నాయకుల యొక్క- వారు మతాచార్యులు అవచ్చు, రాజకీయ నాయకులవచ్చు- ఆ నాయకుల మానసిక స్థాయిని తెలుపుతుంది.

ఈ వాస్తవాలన్నీ- కేవలం పైకి కనిపించేవే కాకుండా, వ్యవస్థకు సంబంధించిన వాటిని, ఆర్థిక పరమైనవీ, సామాజికపరమైన వాటినే కాకుండా అంతర్గతంగా వున్నవి కూడా పరిశీలించినప్పుడు, పాత సంప్రదాయాలను పట్టుకొని వేలాడటం, పదిమంది చేత ఆమోదించబడిన ఆలోచనా ధోరణులూ, అందరిచేతా వల్లించబడే అసంఖ్యాకమైన ధర్మపన్నాలూ కనబడతాయి. అవి కూడా దాటుకొని యింకా లోపలగా వుండే లోతులలోకి అంతర్ముఖంగా వెళ్ళి కనుక చూస్తే, విపరీతమైన అస్తవ్యస్తస్థితి, పరస్పరవైరుధ్యాలు కూడా మనం చూడచ్చు.