పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxxi

కృష్ణమూర్తి తత్వం

అసమానతలను కొనసాగించడానికి 'యోగ్యత గలవారే జీవించగల్గుతారు' అనే సూత్రాన్ని బలపరచే ఒక వుపయుక్తమైన సాధనంగా పనికి వచ్చింది. కృష్ణమూర్తికి తెలిసిన దివ్యజ్ఞానం, ఆతను పెరిగే వయసులో అతని చుట్టూ వున్న దివ్యజ్ఞానమూ కూడా పరిణామక్రమంలో పురోభివృద్ధి అనే వూహా సూత్రాన్ని అతి విపరీతంగా విస్తరించుకున్నది. ఇప్పుడున్న మానవుని స్థితినుంచి దాటి పైన ఎక్కడో దూరంగా ఆధ్యాత్మికమైన ఔన్నత్యం వున్నదనీ, అదే యిక పై భవిష్యత్తులో 'మూలజాతి' అవుతుందనే కధను అల్లింది. ఇప్పుడు, యిరవయ్యవ శతాబ్దం ఆఖరవుతున్న తరుణంలో పరిణామక్రమంలో పురోభివృద్ధి చెందడం అనే ఆలోచన గాలి తీసేసినట్లుగా నీరసపడిపోయింది. పరిణామ క్రమ వాదపు జీవశాస్త్రజ్ఞుడు అయిన స్టీఫెన్ జే గోల్డ్ ఏ మొహమాటమూ లేకుండా తన భావాలను యిట్లా వ్యక్తపరచాడు :

చరిత్ర నడిచిన విధానాన్ని అవగాహన చేసుకోదలిస్తే యీ పురోభివృద్ధి అనే వాదం స్థానంలో మరో కొత్తదానిని కనిపెట్టాలి. ఎందుకంటే యీ పురోభివృద్ధి అనే భావనే చాలా అసహ్యకరమైనది, అది ఆయా సంస్కృతుల్లో నిండా మునిగిపోయివుంటుంది, ఏ విధంగానూ దాన్ని సమర్థించలేము, అమల్లో పెట్టడానికి పనికిరాదు- అసలు అది చాలా మూర్ఖమైన వాదం.

ఆధ్యాత్మిక రంగంలో పరిణామక్రమ గతమైన పురోభివృద్ధిని గురించి కృష్ణమూర్తి చేసిన విమర్శ చాలా శక్తివంతమైనది, నిరాఘాటమైనది, పరిపూర్ణమైనది. మానవ స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి చేసినది. జీవశాస్త్రంలోను, సామాజిక సంస్కరణలోను, రాజకీయ సంబంధిత ఆర్థిక శాస్త్రంలోను పరిణామక్రమంలో పురోభివృద్ధి అనే సూత్రానికి గల పరిమితుల అవగాహన జరగక ముందే కృష్ణమూర్తి యీ పరిశీలన చేశారు. దివ్యజ్ఞాన సమాజంలో అతని పెంపకపు తీరుపై తిరుగుబాటులో యిది బాగా స్పష్టంగా కనపడుతుంది. కృష్ణమూర్తి జీవన తాత్వికతలో అది సుస్థిరంగా వుండిపోయిన ఒక అంశం.

రాధికా హెర్జ్ బర్గర్