Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxvi

కృష్ణమూర్తి తత్వం

తనమీద రుద్దబడిన యీ భూమిక గురించీ, దాని చుట్టూరా వున్న ఆడంబరాలను గురించీ, తతంగాలను గురించీ కూడా ప్రశ్నలు వున్నాయి. ఆ రోజులనాటి అతని చిత్రపటం చూస్తుంటే అందగాడైన, మనోహారుడైన ఒక యువకుడు దూరంగా దృష్టిని సారించి చూస్తూ, నిరాసక్తంగా, తను దేనికీ చెందనట్లు కొంచెం అయోమయంగా కనబడతాడు. ప్రపంచంలో తన స్థానం ఏది అని తెలిసిన వ్యక్తిలో వుండే ఆత్మ విశ్వాసం, స్వార్ధదృష్టీ అతనిలో కనిపించవు.

లెడ్ బీటరన్నా అతని ప్రణాళికలన్నా ప్రతిరోధం చూపడం కృష్ణమూర్తిలో అతని పద్దెనిమిదో ఏటి నుండీ వ్యక్తమవడం మొదలయింది. ఒక పక్కన అతని తండ్రితో సంరక్షణ బాధ్యతకు సంబంధించిన దావా సాగుతూ వున్నది. లెడ్ బీటర్ కు వ్రాసిన ఒక లేఖలో యిట్లా వుంది :

"నా వ్యవహారాలన్నీ నేనే స్వయంగా చూసుకునే సమయం వచ్చిందని అనుకుంటున్నాను. పరమగురువుల ఆదేశాలను యితరులు నా మీద బలవంతానరుద్ది, చీకాకు పెట్టడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది; అంతకంటే నా అంతట నేనే వాటిని స్వీకరించి అమలు చేస్తే, యింతకంటే బాగా చేయగలనని భావిస్తున్నాను... నా బాధ్యతలేమిటి. అన్నది నా అంతట నేను గ్రహించడానికి నాకు అవకాశం యివ్వడం లేదు. చిన్న పాపాయిలా నన్ను అటూ యిటూ ఆడిస్తున్నారు."

1920 కల్లా మానవ సమస్యలకు దివ్యజ్ఞానం ఏవిధంగా అన్వయిస్తుంది అనే సందేహం కృష్ణమూర్తిలో కలిగింది. గాఢంగా ప్రేమించిన వారిని పోగొట్టుకున్న ఒక పరిచితురాలిని గురించి యీ విధంగా వ్రాశాడు :

"అసలైన పరీక్షా సమయం వచ్చినప్పుడు, దివ్యజ్ఞానం కొని, దానికి సంబంధించిన అసంఖ్యాకమైన గ్రంథాలుకానీ ఏ సహాయమూ చేయలేవు. పరమగురువులను ఆమె భౌతికంగా గాని, మానసికంగా కానీ దర్శించాలనుకుంటున్నది. ఆ.బి చేప్పినా లె.బీ. చెప్పినా ఆమె నమ్మలేక పోతున్నది. నిజం చెప్పాలంటే గత రెండు మూడు సంవత్సరాలుగా మేము (నిత్య, నేను) అనుకుంటున్నట్లుగానే ఆమె భావిస్తున్నది... దివ్యశక్తులను జాగృతం చేయడం, యింకా అటువంటి యితర విషయాల జోలికీ పోవద్దని ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాను; కాని ఆమె అదే కావాలని కాంక్షిస్తున్నది."