Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

కృష్ణమూర్తి తత్వం


కృష్ణమూర్తి : వీటన్నింటినీ వర్ణించడం అంటే తన్ను తాను వర్ణించుకోవడమే. తాను అంటే అలవాటుగా మంచి అని నమ్ముతున్న దానినే అనుసరిస్తూపోతూ వుండే నిబద్ధుడైన ఒక జీవి అనమాట. అన్నింటినీ కాదనడం వల్ల మిగిలేది శూన్యం అని మనలో చాలామంది భావిస్తుంటారు. ఇది ఎందువల్ల అంటే, మన నిబద్ధీకరణం, మన భయాలు, మన బాధలు అనే జైలు లోపల జరిగే కార్యకలాపాలు మాత్రమే మనకు తెలుసు. ఈ దృష్టితో చూసినప్పుడు అన్నింటినీ కాదనడం అంటే అదేదో భయంకరమైనదనీ, అంధకారమయమూ, శూన్యమూ అనీ వూహిస్తుంటాం. సమాజమూ, మతమూ, సంస్కృతీ, నీతి సూత్రాలూ వుద్ఘాటించి చెప్పినవన్నీ కాదన్న మనిషి, సామాజిక కట్టుబాట్లు అనే జైలులోనే యింకా మగ్గిపోతున్న వాళ్ళంతా దుఃఖంలో మునిగి వున్నట్లుగా గ్రహిస్తాడు. గతాన్నుంచి విముక్తి చెందిన మనిషి యొక్క కార్యకలాపాలన్నింటిలోనూ పనిచేస్తూ వుండే యీ కాదనడమే సత్య సాక్షాత్కార స్థితి. కాదు అని మనం విసర్జించవలసినది సంప్రదాయంతోను, ఆధిపత్యంతోను ముడిపడివున్న గతాన్ని. కాదనడమే విముక్తి. విముక్తి చెందిన స్వేచ్ఛా మానవుడే జీవించగలడు, ప్రేమించగలడు. చనిపోవడమంటే ఏమిటో తెలిసేది అతనికే.

ప్రశ్న : అంతవరకు స్పష్టంగా వుంది. కానీ, అతీంద్రియమైనది, అలౌకికమైనది, లేదూ మీరు దానికి యింకో పేరు పెట్టినా సరే, దానినుండి వినవచ్చే ఆజ్ఞాత సందేశాలను గురించి మీరు ఏమీ మాట్లాడటం లేదు.

కృష్ణమూర్తి : స్వేచ్ఛలో మాత్రమే దానినుండి వచ్చే సందేశాలను కనిపెట్టగలుగుతాము. దానిని గురించి ఏ వ్యాఖ్యానం చేసినా అది మళ్ళీ స్వేచ్ఛకు అడ్డు వస్తుంది. దానిని గురించి మాట్లాడటం అంటే అర్థం లేని శబ్దాలు వుచ్ఛరించడమే. అది వుంటుంది, అంతే. దానిని మనం కనిపెట్టలేము; రమ్మని పిలిచి ఆహ్వానించలేము. ఒక ప్రత్యేకమైన మార్గంలో దానిని అసలే బంధించలేము. మనసు తన చాతుర్యంతో గారడీలు చేసి దానిని చేజిక్కించుకోలేదు. చర్చీలలో గానీ, మసీదుల్లో గానీ, ఆలయాల్లో గాని అది లేదు. దానిని చేరడానికి ఏ మార్గమూ లేదు. ఏ గురువులూ, ఏ విధానాలూ ఆ సౌందర్యాన్ని ఆవిష్కరించి చూపలేరు. ప్రేమ వున్నప్పుడే ఆ తన్మయానుభూతి కలుగుతుంది. సత్య సాక్షాత్కారం అంటే అదీ.

ప్రశ్న : దాని ద్వారా యీ మహా విశ్వపు స్వభావరీతిని గురించి కాని, చేతనని గురించి కొని, అస్తిత్వాన్ని గురించి కాని ఒక నవ్యమైన అవగాహన కలుగుతుందంటారా? అటువంటిదేదో జరుగుతుందని మతగ్రంధాలన్నీ ఎంతగానో వర్ణించాయి.