పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

కృష్ణమూర్తి తత్వం

యిది. ఇదీ భక్తి పంచుతున్న పరిమళం. అన్ని చోట్లా నాకు యిదే కనబడుతున్నది. జ్ఞానోదయం లేదా సత్య సాక్షాత్కారం కోసం పడే యీ ఆరాటం విపరీతమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నది. ఎంతోమంది బలైపోతున్నారు దీని కారణంగా. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏమిటంటే, నిజంగానే సత్య సాక్షాత్కారం అనేది ఒకటి వున్నదా? వుంటే కనుక అది ఏమిటి?

కృష్ణమూర్తి : మీ నిత్యజీవితం నుంచి అది ఒక పలాయనం కనుక అవుతే - నిత్యజీవితం అంటే అసంఖ్యాకమైన కదలికలతో కూడుకొని వున్న సంబంధ బాంధవ్యాలు - అటువంటి నిత్యజీవితం నుంచి యిది పలాయనం కనుక అవుతే, అప్పుడు ఆత్మజ్ఞానం అనీ, యింకా ఏవేవో పేర్లతో మీరు పిలుస్తున్నదీ అయిన యీ సత్య సాక్షాత్కారం వట్టి మిధ్య; బూటకం. జీవితం ఎడల ప్రేమనీ, అవగాహనని, క్రియాచరణని తిరస్కరించేది ఏదయినా సరే చాలా విపరీతమైన అనర్ధాలని సృష్టిస్తుంది. మనసుని వక్రీకరిస్తుంది. ఇక అప్పుడు జీవితం చాలా ఘోరంగా తయారవుతుంది. పోనీ, లోకమంతా ఆమోదించిన ఒక పరమ సూత్రంగా దీనిని తీసుకుంటే - అప్పుడు యీ సత్య సాక్షాత్కారాన్ని - దాని అర్థం ఏదయినా సరే, దానిని జీవించడం అనే చర్యలోనే పొందగలమా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. నిజానికి, ఒక సిద్ధాంతం కంటె, ఒక ఆదర్శం కంటె, ఒక లక్ష్యం కంటె, సూత్రం కంటె కూడా జీవించడం అన్నదే చాలా ప్రధానమైనది. జీవించడం అంటే ఏమిటో మనకి తెలియదు గాబట్టి పలాయనవాదాన్ని వుపదేశించే యిటువంటి మిధ్యాపూర్వకమైన, అవాస్తవమైన సూత్రాలను మనం తయారు చేసుకుంటాం. అసలు ప్రశ్న ఏమిటంటే, మనిషి జీవించడంలోనే, జీవితానికి సంబంధించిన రోజువారీ కార్యకలాపాలలోనే యీ సత్య సాక్షాత్కారాన్ని పొందగలడా లేక చాలా అసాధారణమైన శక్తులు సంపాదించిన కొద్దిమందికి మాత్రమే యీ కటాక్షం సిద్ధిస్తుందా? సత్య సాక్షాత్కారం అంటే తనే ఒక దీపంగా వెలిగి, తనకు కాంతినిచ్చుకోవడం. కాని, యీ దీపం తను స్వయంగా చిత్రించుకున్నదీ, తనే కల్పన చేసుకున్నదీ కాకూడదు; తన వ్యక్తిగతమైన ఒక తిక్క చేష్టా కాకూడదు. మొదటి నుంచీ నిజమైన మతం, అంటే వ్యవస్థగా ఏర్పడిపోయిన విశ్వాసాలు, భయాలు కావు - ఆ నిజమైన మతం చెప్తున్నది యిదే.

ప్ర: నిజమైన మతం చెప్పేది యిదీ అని మీరు అంటున్నారా? మరి అప్పుడు, యిందులో నిష్ణాతులైన వారూ, యిదే వృత్తిగా అవలంబించినవారూ కలిసి ఒక పక్షమూ, తక్కిన ప్రపంచమంతా ఎదుటి పక్షమూ అయిపోతారే. అంటే మీ అర్ధం మతం వేరూ, సాధారణ జీవనం వేరు అనా?