పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతి దర్శనం

ఒకరి ప్రశ్న ? పారమార్థికులము అని చెప్పుకునే వాళ్ళందరిలోనూ ఒక సామాన్య లక్షణం వుంటుంది. మీ ప్రసంగాలు వినడానికి వస్తున్న వారిలో కూడా నాకు యీ లక్షణం కనబడుతున్నది. నిర్వాణమనీ, విమోచనమనీ, జ్ఞానోదయం అనీ, ఆత్మ సాక్షాత్కారమనీ, ఆద్యంతరహితమైనదనీ, దేవుడనీ రకరకాల పేర్లు పెట్టి, దానికోసం వాళ్ళు వెతుకుతూ వుంటారు. వాళ్ళకు వాళ్ళ లక్ష్యం స్పష్టంగా కనబడుతూ వుంటుంది, రకరకాలైన వుపదేశ మార్గాలన్నీ యీ లక్ష్యాన్నే మన కళ్ళ ముందు ఆడిస్తూ వుంటాయి. ఈ పుపదేశాలకు, వర్గాలకు అన్నింటికీ ప్రత్యేకమైన గ్రంధాలు, ప్రత్యేకమైన బోధనా రీతులు, గురువులు, నీతి నియమావళి, తాత్విక ధోరణి వుంటాయి. ఆశలు రేకెత్తించడం, బెదిరింపులు కూడా వుంటాయి. ఇవన్నీ కలిసి తక్కిన ప్రపంచానికి దూరంగా వుండే ఒక తిన్నని, యిరుకైన మార్గంగా ఏర్పడతాయి. ఈ మార్గానికి చివరి కొసన స్వర్గమో, మరొకటో వున్నట్లు వూరిస్తాయి. అన్వేషకుల్లో చాలామంది ఒక మార్గం వదిలేసి మరొక పద్ధతికి మారుతూ వుంటారు. పాతదానిని వదిలేసి, ఆ స్థానంలో తాజాగా వినబడుతున్న యింకొక కొత్త బోధనా మార్గాన్ని స్వీకరిస్తూ వుంటారు. అన్నింటిలో వున్నదీ ఒకటే సూత్రమని గ్రహించుకోలేక, వుద్రేకాలను రెచ్చగొట్టే యీ కార్యక్రమాలలో, ఒకదాని తర్వాత యింకోదానిలో పడిపోతూ దేనికోసమో వెతుక్కుంటూ వుంటారు. కొంతమంది ఏదో ఒక పద్ధతి, ఒక కూటమిలోనే వుండిపోయి, అక్కడ నుండి కదలడానికి యిష్టపడరు. కొంతమంది చివరకు తాము కోరుకున్న సత్యదర్శనాన్ని సాధించామని నమ్మి, అందరికీ దూరంగా ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో రోజులు గడుపుతుంటారు. వీళ్ళచుట్టూ శిష్యబృందం మూగి, మళ్ళీ అదే కార్యక్రమ చక్రం తిరగడం ఆరంభమవుతుంది. వీరందరిలోనూ ఏదో విధంగా సత్యదర్శనం పొంది తీరాలనే ఒత్తిడీ, విపరీతమైన ఆశా వుంటాయి. వాటితోపాటే దుర్భరమైన నిస్పృహ, ఆశలు విఫలమవడంవల్ల కలిగిన బాధ కూడా వుంటాయి. ఇదంతా నాకు చాలా అనారోగ్యకరంగా అనిపిస్తున్నది. వీళ్ళందరూ ఏదో ఒక కాల్పనికమైన లక్ష్యం అందుకోవడం కోసం తమ సాధారణ జీవితాన్ని త్యాగం చేసివేస్తారు. ఈ రకమైన వాతావరణంలో నుండి అతి తీవ్ర మతమౌఢ్యం, వెర్రి వుత్సాహం, హింసాతత్వం, మూర్ఖత్వం వంటి జుగుప్సాకరమైన ధోరణులు పుట్టుకు రావడంలో సందేహం లేదు. ఇటువంటి వారిలో కొందరు మంచి మంచి రచయితలు కూడా వుండటం చాలా ఆశ్చర్యం గొల్పుతుంది. ఇదొక్కటి తప్ప యితరత్రా వాళ్ళు మానసికంగా ధృఢంగానే వుంటారు. దీనంతటికీ మతం అని పేరు పెడతారు. మహా కంపు కొట్టే వ్యవహారం