పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంభాషణలూ, సంవాదాలు

193

శక్తి అంతటితోను, తక్షణమే తలపడేటట్లుగా చేసే సామర్థ్యం, సత్తువ, సజీవశక్తి, పట్టుదల మనకు ఎట్లా వస్తున్నాయి? మనలోని శక్తిని విభజించడం జరిగిన మరుక్షణమే సంఘర్షణ పుట్టుకొస్తుంది. అందువల్ల ఒక విషయాన్ని సమగ్రంగా చూడటం జరుగదు, గ్రహించడం జరగదు. సరే, ఒక నాగుపాముని చూసినప్పుడు వులిక్కిపడి ఎగురుతారు, యీ శక్తి మీకు ఎక్కడినుంచి వస్తున్నదీ? ఈ విధంగా మీరు అనే ఆ మొత్తం జీవి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, తక్షణమే ప్రతిస్పందన జరిపి, వులిక్కిపడి ఎగరడానికి వెనకాల వున్న ప్రక్రియలు - శరీర సంబంధమైనవీ, మనోతత్వ సంబంధమైనవీ కూడా అవి ఏమిటీ? ఆ తక్షణత వెనకాల వున్నవి ఏమేమిటి? తక్షణమే జరిగే ఆ చర్యలో చాలా సంగతులు నిబిడీకృతమై వున్నాయి: భయమూ, ప్రాణరక్షణ చేసుకొనే స్వభావం - యిది తప్పకుండా వుండవలసిన గుణం - నాగుపాము ప్రాణాపాయం కలిగిస్తుందనే సమాచారం - యివన్నీ వున్నాయి.

అటువంటప్పుడు, గర్వాన్ని కరిగించివేసుకొనే విషయంలో కూడా యిదే విధమైన, సశక్తిమంతమైన చర్య ఎందుకు జరుగదు? గర్వాన్ని ఒక వుదాహరణగా మాత్రమే యిక్కడ తీసుకుంటున్నాం. ఈ విషయంలో ఆ శక్తి మనకు లేకపోవడానికి వెనకాల అనేక కారణాలు వున్నాయి. గర్వంగా వుండటం నాకు యిష్టం. ప్రపంచం దానిమీదే నడుస్తున్నది. సమాజపు పద్ధతులన్నీ దీనిమీదే ఆధారపడి వున్నాయి. ఈ గర్వం వల్ల నాలో ఒక బలోత్సాహం, ఒక రకమైన హుందాతనం, ఎవ్వరితోనూ సన్నిహితంగా వుండకపోవడం, యితరుల కంటే గొప్ప అనే ఒక భావమూ కలుగుతున్నాయి. ఇవన్నీ కలిసి గర్వాన్ని కరిగించి వేసెయ్యడానికి అవసరమైన శక్తికి అడ్డుగా నిలుస్తాయి. చూడండి, నేను చేయవలసిన చర్యకు అడ్డు తగులుతున్న కారణాలను, గర్వంతో తలపడటానికి కావలసిన శక్తినీ నిరోధిస్తున్న కారణాలను నేను విశ్లేషిస్తూనైనా కూర్చుంటాను. లేదూ తక్షణమే ఆ సంగతి గ్రహిస్తాను. విశ్లేషణ అంటే కాలంతో ముడిపడిన ప్రక్రియ. వాయిదా వేయడానికి ఒక పద్ధతి. నేను విశ్లేషణ జరుపుతూ వున్నప్పుడు గర్వం కొనసాగుతూనే వుంటుంది. కాలం దాన్ని అంతం చేయబోవడం లేదు. కాబట్టి గర్వాన్ని సంపూర్ణంగా నేను చూడాలి. కానీ అట్లా చూసే శక్తి నాకు లేదు. ఈ విధంగా చెదిరిపోయి వృధా అవుతున్న శక్తిని పోగుచేసుకోవాలంటే, గర్వం వంటి సమస్యలను ఎదుర్కొనప్పుడు కాకుండా, నిరంతరమూ, ఏ సమస్యా లేనప్పుడు కూడా శక్తిని కూడగట్టుకోవడం అన్నది జరుగుతూనే వుండాలి. ఎప్పుడూ సమస్యల్లోనే మునిగి తేలుతూ వుండం, సమస్యలు లేని క్షణాలు కూడా వుంటాయి. అటువంటి సమయాల్లో శక్తిని కనుక మనం సేకరించుకుంటూ వుంటుంటే, యిక్కడ సేకరణ